ప్రైవేటు ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం.. ఏడుగురు మృతి.!
Terrible fire broke out in jabalpur hospital 7 burn to death many injured. మధ్యప్రదేశ్ జబల్‌పూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో సోమవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిప్రమాదంలో ఇప్పటి
By అంజి Published on 1 Aug 2022 11:22 AM GMTమధ్యప్రదేశ్ జబల్‌పూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో సోమవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిప్రమాదంలో ఇప్పటి వరకు ఏడుగురు మంది మృతి చెందినట్లు సమాచారం. దమోహ్ నాకా శివనగర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో మంటలు చెలరేగాయి. కొద్దిసేపటికే మంటలు ఆసుపత్రి మొత్తం వ్యాపించాయి. ఆస్పత్రి పైఅంతస్తులో ఉన్న వారు కిటికీల నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. కానీ కింది అంతస్తులో ఉన్నవారిలో కొందరు మాత్రం తమను తాము రక్షించుకోలేకపోయారు. మరోవైపు సమాచారం అందిన వెంటనే రెస్క్యూ టీమ్, సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనపై విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని మంత్రి విశ్వాస్ సారంగ్ తెలిపారు.
''ప్రస్తుతానికి ఈ ఆసుపత్రి గురించి పెద్దగా సమాచారం లేదు. ఇది ఎవరి ఆసుపత్రి, ఎంత మంది సిబ్బంది ఉన్నారనే సమాచారం సేకరిస్తున్నాం.'' అని ఓ పోలీసు అధికారి తెలిపారు. మంటలు చెలరేగడంతో ఆస్పత్రి నుంచి సిబ్బంది, కొంత మంది రోగులు బయటకు పరుగులు తీశారు. ప్రమాదం జరిగిన సమయంలో ఎంత మంది ఆసుపత్రిలో ఉన్నారనే విషయం స్పష్టత లేదు. ఆస్పత్రిలో ఉన్న పలువురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక ప్రజలు వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఘటనా స్థలాన్ని ఎస్పీ సిద్ధార్థ బహుగుణ, కలెక్టర్ ఇలయ్య రాజా, సీఎంహెచ్‌వో రత్నేష్ కురారియా, అగ్నిమాపక దళ అధికారి కుషాగ్రా ఠాకూర్, సీఎస్‌పీ అఖిలేష్ గౌర్, ఏఎస్పీ గోపాల్ ఖండేల్, ఏఎస్పీ ప్రదీప్ షెండే, అధికారులు పరిశీలిస్తున్నారు. ''మొదట్లో అగ్ని ప్రమాదం జరిగినట్లు అనిపించలేదు. అయితే కొంతసేపటికే ఒక్కసారిగా నల్లటి పొగ రావడం మొదలైంది. క్షణాల్లో మంటలు భారీగా వ్యాపించాయి. ఒక్కసారిగా పొగలు కమ్ముకోవడంతో మంటలు ఎగసిపడ్డాయి. మంటలు చాలా బలంగా ఉండడంతో ఒక్కక్షణంలోనే ఆస్పత్రి మొత్తం దగ్ధమైంది.'' అని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.