ఉగ్ర‌వాదులుగా పొర‌బ‌డి పౌరుల‌పై భద్రతా దళాల కాల్పులు.. 14 మంది మృతి.. ప‌రిస్థితి ఉద్రిక్తం.. సిట్ విచార‌ణ‌కు సీఎం ఆదేశం

Tension Grips Nagaland as Civilians Killed in Firing by Security Forces.ఉగ్ర‌వాదులుగా బావించి సాధార‌ణ పౌరుల‌పై

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 Dec 2021 10:29 AM IST
ఉగ్ర‌వాదులుగా పొర‌బ‌డి పౌరుల‌పై భద్రతా దళాల కాల్పులు.. 14 మంది మృతి.. ప‌రిస్థితి ఉద్రిక్తం.. సిట్ విచార‌ణ‌కు సీఎం ఆదేశం

ఉగ్ర‌వాదులుగా బావించి సాధార‌ణ పౌరుల‌పై భ‌ద్ర‌తా ద‌ళాలు కాల్పులు జ‌రిపాయి. ఈ దారుణ ఘ‌ట‌న నాగాలాండ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో ఆరుగురు పౌరులు మృతి చెందార‌ని అధికారులు చెబుతుండ‌గా.. 14 మంది చ‌నిపోయార‌ని గ్రామ ప్ర‌జ‌లు చెప్పారు. మ‌రికొంద‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డార‌ని అంటున్నారు. మృతులంతా బొగ్గు గ‌నుల్లో పని చేసేవార‌ని తెలిపారు. శ‌నివారం రాత్రి ఈ ఘ‌ట‌న చోటుచేసుకున్న‌ట్లు ప్ర‌త్య‌క్ష సాక్షులు వెల్ల‌డించారు. ఈ ఘ‌ట‌న త‌రువాత మోన్ జిల్లాలోని ఓటింగ్ గ్రామంలో తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఆగ్ర‌హాంతో గ్రామ ప్ర‌జ‌లు భద్రతాబలగాల వాహనాలను తగలబెట్టారు. దీంతో అక్క‌డ ప‌రిస్థితులు చేదాటిపోతున్న క్ర‌మంలో పోలీసులు మ‌రోసారి కాల్పులు జ‌రిపారు. ఈ కాల్పుల్లో మ‌రికొంద‌రు గాయ‌ప‌డిన‌ట్లు స్థానికులు చెబుతున్నారు. ప్ర‌స్తుతం ఆగ్రామంలో వాతావ‌ర‌ణం నివురుగ‌ప్పిన నిప్పులా ఉంది. ఎప్పుడు ఏం జ‌రుగుతుందో తెలియ‌ని ఆందోళ‌న నెల‌కొంది.

అంతకుముందు నాగాలాండ్‌లో ఉగ్రవాదులు భద్రతా బలగాలపై దాడి చేశారు. ఈ ఘటనలో పలువురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. దీంతో భద్రతా దళాలు సైతం కాల్పులకు జ‌రిపాయి. కాగా.. అదే స‌మ‌యంలో అటుగా వ‌స్తున్న కూలీల వాహ‌నాన్ని చూసి ఉగ్ర‌వాదులుగా బావించి వారిపై కాల్పులు జ‌రిపారు. మృతుల్లో చాలా మంది బొగ్గు గ‌నుల్లో ప‌నిచేస్తున్న కార్మికులు ఉన్నారు. వారు ప‌ని ముగించుకుని ఇళ్ల‌కు వ‌స్తున్న స‌మ‌యంలో ఈ ఘ‌టన జ‌రిగింది.

కాగా.. ఈ ఘ‌ట‌న ఎంతో దుర‌ద‌ష్ట‌క‌ర‌మ‌ని నాగాలాండ్ సీఎం నైపూ రియో అన్నారు. అమాయ‌క ప్ర‌జ‌లపై కాల్పులు జ‌ర‌పడాన్ని తీవ్రంగా ఖండిస్తున్న‌ట్లు చెప్పారు. మృతుల కుటుంబాల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేశారు. కాల్పుల్లో గాయ‌ప‌డిన వారు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షించారు. కాల్పుల‌పై సిట్ ద‌ర్యాప్తు చేస్తుంద‌ని.. బాధితుల‌కు న్యాయం జ‌రుగుతుంద‌ని హామీ ఇచ్చారు. ప్ర‌జ‌లంతా సంయ‌మ‌నం పాటించాల‌ని ట్వీట్ చేశారు.

Next Story