బిహార్ మాజీ సీఎం, రాష్ట్రీయ జనతా దళ్ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం కాస్త మెరుగుపడింది. ఈ విషయాన్ని ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్ తెలిపారు. లాలూ ఆరోగ్యంపై వస్తున్న పుకార్లను నమ్మవద్దని ప్రజలను కోరారు. లాలూ ఆరోగ్యం మునుపటి కంటే చాలా మెరుగ్గా ఉందని చెప్పారు. ఆస్పత్రిలో లాలూ కిచిడీ తిన్నారని, ప్రస్తుతం ఇంటెన్సివ్ కేర్‌లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని తెలిపారు.
''నాన్న కుటుంబ సభ్యులతో మాట్లాడారు. కేవలం పడుకున్నప్పుడు మాత్రమే ఆయనకు వైద్యులు ఆక్సిజన్ ఇస్తున్నారు. త్వరలోనే ఐసీయూ నుంచి జనరల్ వార్డుకు తరలించే ఛాన్స్ ఉంది'' అని తేజస్వీ యాదవ్ తెలిపారు. ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న లాలూ సపోర్ట్‌తో నిల్చుంటున్న ఫొటోలను ఆయన కుమార్తె మిసా భారత ట్విటర్‌లో షేర్ చేశారు. క్రమక్రమంగా ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోందని తెలిపారు.
జులై 3న లాలూ మెట్లపై నుంచి జారి పడి గాయపడ్డారు. పాట్నాలోని తన సతీమణి రబ్రీదేవీ నివాసంలో ఉంటున్న ఆయన.. మెట్లు ఎక్కుతుండగా జారిపడ్డారు. ఈ క్రమంలోనే ఆయన భుజం విరిగింది. మొదట పాట్నాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. పరిస్థితి క్షీణించడంతో ఎయిర్ అంబులెన్స్‌లో ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ కోసం ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించారు. లాలూ కొంతకాలంగా కిడ్నీ, హార్ట్ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే కిడ్నీ సమస్య చికిత్స కోసం విదేశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. దీని కోసం కోర్టు నుంచి సైతం పర్మిషన్ కూడా తీసుకున్నారు.