లైంగిక వేధింపుల కేసులో జర్నలిస్ట్ తరుణ్ తేజ్‌పాల్‌కు ఊరట
Tehelka Founder Tarun Tejpal Acquitted In Rape Case. తెహల్కా వ్యవస్థాపకుడు, జర్నలిస్ట్ తరుణ్ తేజ్‌పాల్‌కు ఊరట లభించింది లైంగిక వేధింపుల కేసులో
By Medi Samrat
తెహల్కా వ్యవస్థాపకుడు, జర్నలిస్ట్ తరుణ్ తేజ్‌పాల్‌కు ఊరట లభించింది. లైంగిక వేధింపుల కేసులో ఆయనను గోవా కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. ఒకనాడు దేశంలోనే ఒక ప్రముఖ జర్నలిస్టుగా, ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు తరుణ్ తేజ్‌పాల్. రక్షణ శాఖలో ని కుంభకోణాన్ని స్పై ఆపరేషన్ ద్వారా వెలుగులోకి తెచ్చిన తెహల్కా పత్రిక వ్యవస్థాపకులు.
అయితే తేజ్ పాల్ తనపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ ఓ మహిళా జర్నలిస్ట్ 2013లో ఫిర్యాదు చేశారు. గోవాలో జరిగిన ఓ కాన్ఫరెన్స్‌కు హాజరైనప్పుడు ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో తేజ్‌పాల్ తనపై అత్యాచారానికి పాల్పడినట్టు ఆమె ఆరోపించారు. దీంతో ఆయనపై అత్యాచారం, లైంగిక వేధింపులు తదితర సెక్షన్ల కింద కేసు నమోదైంది. తేజపాల్ కొంతకాలం జైల్లో ఊచలు లెక్కపెట్టారు.
అయితే ఈ ఆరోపణలు అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించాయి. తేజ్ పాల్ ఈ అంశంపై సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. సుప్రీంకోర్టు బెయిల్ అయితే ఇచ్చింది గానీ,విచారణ మాత్రం గోవా కోర్టులోనే జరగాలంది. అయితే ఆరు నెలల్లోగా కేసును తేల్చేయాలని స్పష్టం చేసింది. కేసును విచారించిన గోవా కోర్టు తేజ్ పాల్ ను నిర్దోషిగా ప్రకటించింది. నిజానికి గోవా సెషన్స్ కోర్టు మొన్న బుధవారమే తీర్పు వెలువరించాల్సి ఉంది. అయితే తౌక్టే తుఫాను కారణంగా ఇబ్బందులు తలెత్తడంతో ఈరోజు తీర్పును వెలువరించింది.
తరుణ్ తనను అత్యాచారం చేశారంటూ సదరు మహిళా ఉద్యోగి తెహెల్కాలో తన సీనియర్లకు ఆరోపించారు. తన తప్పును ఒప్పుకున్న తేజ్‌పాల్ ఎడిటర్ ఇన్ చీఫ్ పదవికి స్వచ్చందంగా రాజీనామా చేశారు. అయితే చట్టం మాత్రం తనపని తాను చేసుకుపోయింది. అత్యాచారం కేసులో తరుణ్ తేజపాల్ నవంబరు 2013లో అరెస్ట్ కాగా.. 2014 మేలో బెయిల్‌పై బయటకు వచ్చారు.