కరోనా మహమ్మారి దరిచేరకుండా ఉండేదుకు చాలా మంది జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. జలుబు, దగ్గు వంటివి దరి చేరకుండా ఉండేందుకు కావాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. అయితే కొందరు వదంతులను నిజమని నమ్మి ప్రాణాలను కూడా తీసుకుంటూ ఉన్నారు. నిజమేమిటో తెలుసుకోకుండా, శాస్త్రీయంగా రుజువైందా లేదా అనే విషయాన్ని పట్టించుకోని చాలా మంది.. ఏది పడితే అది చేయడానికి సిద్ధమై ఉన్నారు. చిన్న ఫార్వర్డ్ మెసేజీని నమ్మి ప్రాణాల మీదకు తెచ్చుకున్న వాళ్లు కూడా ఉన్నారు. ముక్కు లోకి నిమ్మరసం పిండుకుంటే కరోనా దగ్గరకు రాదనే మెసేజీ కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఈ పని చాలా ప్రమాదకరం అలాంటి పని చేయకండని చాలా మంది నిపుణులు తెలిపారు. అలా ఓ వ్యక్తి ముక్కులోకి నిమ్మరసం పిండుకోవడం వలన ప్రాణాలనే కోల్పోయాడు.
కర్ణాటక రాష్ట్రం రాయచూరుజిల్లాలో కరోనా రాకూడదని ముక్కులోకి నిమ్మరసం పిండుకొన్న ఓ ఉపాధ్యాయుడు మృతి చెందాడు. ఈ ఘటన బుధవారం నాడు చోటు చేసుకుంది. ముక్కులో నిమ్మరసం పిండుకుంటే ఊపిరితిత్తుల్లోని కఫం బయటపడి కరోనా బారిన పడకుండా ఉండవచ్చనే బసవరాజ్ నమ్మాడు. సింధనూరులోని శరణ బసవేశ్వర కాలనీలో నివాసం ఉంటున్న బసవరాజ్ నిమ్మరసం పిండుకోగా, అస్వస్థతకు గురయ్యాడు. ఆ తర్వాత మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బసవరాజ్ వయసు 43 సంవత్సరాలు. చదువుకున్న వ్యక్తి ఇలా దేన్ని పడితే దాన్ని నమ్మి.. ప్రాణాలనే పోగొట్టుకున్నాడు. బసవరాజ్ మృతితో వారి ఊరిలో విషాద ఛాయలు అలముకున్నాయి.