కరోనా మహమ్మారి దెబ్బకు ఎంతో మంది ప్రాణాలను కోల్పోతూ ఉన్న సంగతి తెలిసిందే..! ఎన్నో జీవితాలు అంధకారంలోకి వెళ్లిపోయాయి. ప్రముఖ కంపెనీల్లో పని చేసే ఉద్యోగులు కరోనా కాటుకు బలయ్యారు. ఉద్యోగం చేస్తూ ఉన్న వ్యక్తిని కుటుంబం కోల్పోతే ఎన్నో కష్టాలను ఎదుర్కోక తప్పదు.. అలాంటి కుటుంబాలకు కొన్ని సంస్థలు అండగా నిలుస్తూ ఉన్నాయి. అలా అండగా నిలిచిన కంపెనీల్లో టాటా స్టీల్ తన ప్రత్యేకతను మరోసారి చాటుకుంది.
కోవిడ్‌తో చనిపోయిన తమ సంస్థ ఉద్యోగ కుటుంబీకులకు.. సదరు ఉద్యోగి రిటైర్మెంట్ వయసు వచ్చే వరకు ఆ ఉద్యోగి నెల జీతాన్ని కుటుంబసభ్యులకు ఇవ్వనున్నది. ఉద్యోగి 60 ఏళ్ల వయసు వరకు ఆ ఉద్యోగి కుటుంబసభ్యులకు నెల జీతం ఇవ్వనున్నారు. ఆ ఉద్యోగి చివరి సారి ఎంత జీతం తీసుకున్నాడో.. ఆ జీతాన్ని ప్రతి నెల వారి కుటుంబసభ్యులకు ఇవ్వనున్నట్లు టాటా స్టీల్ చెప్పింది.
టాటా కంపెనీలో పనిచేస్తున్న ఫ్రంట్‌లైన్ వర్కర్‌కు కోవిడ్ సంక్రమించి, ఆ వ్యక్తి ఒకవేళ మరణిస్తే.. ఆ ఉద్యోగి పిల్లల చదువులను మొత్తం కంపెనీ భరించనున్నది. చనిపోయిన వ్యక్తి నెల జీతం కూడా ఇస్తూ ఉంటారు. పిల్లలు భారతదేశంలో గ్రాడ్యుయేషన్ పూర్తి అయ్యేంత వరకు ఆ మొత్తం ఖర్చును టాటా స్టీల్ కంపెనీ పెట్టుకోనుంది. టాటా స్టీల్ కంపెనీ చేసిన ప్రకటనపై ప్రశంసలు లభిస్తూ ఉన్నాయి.