రైలులో అగ్నిప్రమాద ఘటనలో నోట్ల కట్టల కలకలం
మంటలకు కాలిపోయిన కోచ్‌లో ఓ చోట నోట్ల కట్టలు కనిపించాయి.
By Srikanth Gundamalla Published on 28 Aug 2023 11:02 AM ISTరైలులో అగ్నిప్రమాద ఘటనలో నోట్ల కట్టల కలకలం
తమిళనాడులోని మధురై రైల్వే స్టేషన్ దగ్గర శనివారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. అయితే.. అగ్నిప్రమాదం జరిగిన సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే రైలులోని బోగీలను పరిశీలించారు. పోలీసులకు అనుకోని షాక్ ఎదురైంది. మంటలకు కాలిపోయిన కోచ్‌లో ఓ చోట నోట్ల కట్టలు కనిపించాయి. అవికూడా సగం కాలిపోయి ఉండటం కలకలం రేపుతోంది.
ఫోరెన్సిక్ నిపుణులు ప్రమాద ఘటనపై వివరాలు సేకరించేందుకు బోగీలను పరిశీలించారు. ఆ క్రమంలోనే కాలిన నోట్ల కట్టలు బయటపడ్డాయి. భారీగా నోట్ల కట్టలు కనిపించడంతో రైల్వే అధికారులు, పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులు సైతం ఆశ్చర్యపోయారు. అయితే.. దొరికిన కరెన్సీలో రూ.200, రూ.500 నోట్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. యాత్రికుల కోసం దారిలో ఖర్చులకు ట్రావెల్ ఏజెన్సీ వారు ఆ డబ్బుని తెచ్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. మొత్తం 63 మంది ప్రయాణికులు లక్నో నుంచి ప్రత్యేక కోచ్‌లో తమిళనాడుకు వచ్చారు. అయితే.. ఈ ప్రమాదం జరిగిన తర్వాత ఇద్దరు వ్యక్తులు మాయం అయినట్లు తెలుస్తోంది. వారి కోసమే పోలీసులు గాలిస్తున్నట్లు చెప్పారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. చివరికీ వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అగ్నిప్రమాద ఘటనకు వీరి ఇద్దరికీ ఏదైనా సంబంధం ఉందా అనే కోణంలోనూ పోలీసులు అనుమానిస్తున్నారు. దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.