ఘోర రోడ్డు ప్రమాదం, స్పాట్‌లోనే ఆరుగురు మృతి
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు, లారీ ఢీకొన్న సంఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు.
By Srikanth Gundamalla Published on 28 Jan 2024 1:51 PM ISTఘోర రోడ్డు ప్రమాదం, స్పాట్‌లోనే ఆరుగురు మృతి
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు, లారీ ఢీకొన్న సంఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదం జనవరి 28న తెల్లవారుజామున తమిళనాడులోని తెన్‌కాసి జిల్లాలో చోటుచేసుకుంది. కడయనల్లూరు దగ్గర సేలం-వృద్ధాచలం జాతీయ రహదారిపై తెల్లవారుజామున కారు వేగంగా దూసుకొచ్చింది. ఇక అదే రూట్‌లో సిమెంట్ లోడుతో లారీ వచ్చింది. అయితే.. రెండు దగ్గరకు రాగానే వాహనాలు అదుపుతప్పాయి. దాంతో.. ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఎదురెదురుగా ఢీకొనడం.. కారు వేగంగా ఉండటంతో ప్రమాద తీవ్రత పెరిగింది.
అయితే.. ఈ రోడ్డుప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు సంఘటనాస్థలిలోనే దుర్మరణం చెందారు. ఇక ఈ ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేమాలను కారు నుంచి బయటకు తీసి పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈప్రమాదంలో చనిపోయినవారంతా తెన్‌కాసి జిల్లా పులియంగుడికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. అయితే.. కారులో ఉన్న ఆరుగురు కూడా స్నేహితులని పోలీసులు చెప్పారు. జనవరి 27న శనివారం రాత్రి కారులో కుర్దాలం వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జునుజ్జు అయ్యింది. దానిని బట్టి కారు అత్యంత వేగంగా ఉందని పోలీసులు అంటున్నారు. దీనిపై కేసు నమోదు చేశామని.. దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు వెల్లడించారు.