నిజమైన ప్రేమంటే ఇదే.. ప్రియుడి కాళ్లు చచ్చుడిపోయినా.. పెళ్లి చేసుకుంది.. ఆఖర్లో ట్విస్ట్
Tamil Nadu woman marries boyfriend who lost his legs in accident.ఆ ఇద్దరికి ఒకరంటే మరొకరికి ఎంతో ఇష్టం
By తోట వంశీ కుమార్ Published on 2 Oct 2022 12:07 PM ISTఆ ఇద్దరికి ఒకరంటే మరొకరికి ఎంతో ఇష్టం. ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కులాలు కూడా ఒకటే కావడంతో పెద్దలు కూడా అడ్డు చెప్పలేదు. ఇంకేముంది ఆనందంగా పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్న తరుణంలో విధి వారిని వెక్కిరించింది. ప్రియుడికి యాక్సిడెంట్ జరిగింది. వెన్నుముకకు దెబ్బతగలడంతో అతడి రెండు కాళ్లు చచ్చుబడిపోయాయి. దీంతో అమ్మాయి తల్లిదండ్రులు రివర్స్ అయ్యారు. అతడిని చేసుకుని నువ్వు ఏం సుఖపడుతావు అని వేరే సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. అయితే.. ఆ యువతి మాత్రం కన్నవారిని కాదనుకుని ప్రియుడిని పెళ్లి చేసుకుంది. తమిళనాడు తిరునెల్వేలి జిల్లాలోని వెల్లియూర్ లో జరిగినఈ ఘటన నిష్కల్మషమైన ప్రేమకు నిదర్శనంగా నిలిచింది.
వివరాలు ఇలా ఉన్నాయి. కేసవనేరి గ్రామానికి చెందిన ప్రకాశ్(25), వల్లియమ్మాల్పురానికి చెందిన దివ్య(22) లు ఐదు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఇరు కుటుంబాలు వారి ప్రేమకి అడ్డుచెప్పలేదు. అంతా సాఫీగా సాగిపోతున్న క్రమంలో ప్రకాశ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. వెన్నముకకు దెబ్బతగలడంతో రెండు కాళ్లు చచ్చుబడిపోయాయి. దీంతో ప్రకాష్‌తో పెళ్లి వద్దంటూ దివ్య తల్లిదండ్రులు ఆమెకు నచ్చజెప్పేందుకు యత్నించారు.
ఎవరు ఎన్ని చెప్పినా అవేమి పట్టించుకోని దివ్య.. సెప్టెంబర్ 20న ప్రకాశ్ ఇంటికి వెళ్లింది. అతడి కుటుంబ సభ్యుల సమయక్షంలో ప్రకాష్-దివ్యలు పెళ్లి చేసుకున్నారు. విషయం తెలుసుకున్న దివ్య తల్లిదండ్రులు సెప్టెంబర్ 29న ప్రకాష్ ఇంటికి వెళ్లి గొడవ పడ్డారు. వారిపై దాడి చేసి దివ్యను బలవంతంగా తీసుకుని వెళ్లిపోయారని ప్రకాష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తమ ఇద్దరిని కలపాలని పోలీసులను వేడుకున్నాడు. ప్రస్తుతం ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.