తమిళనాడు మంత్రి కుమార్తె ఒక వ్యాపారవేత్తతో వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంది. కర్ణాటక రాజధాని బెంగళూరులో పోలీసు రక్షణను కోరినట్లు తెలుస్తోంది. తమిళనాడు రాష్ట్ర హిందూ మత, ధర్మాదాయ శాఖ మంత్రి పీకే శేఖర్‌బాబు కుమార్తె, వైద్యురాలు జయకళ్యాణి బెంగుళూరు నగర పోలీసు కమిషనర్ కమల్ పంత్ ను భద్రత కల్పించాలంటూ కోరింది. ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. గత ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్న సతీష్‌కుమార్‌ను తాను పెళ్లి చేసుకున్నట్లు తెలిపింది. తనకు, తన భర్తకు ప్రాణ భయం ఉందని, అందుకే పోలీసు రక్షణ కావాలని కోరింది. "నేను ఎంబీబీఎస్ చేసాను అతను డిప్లొమా పూర్తి చేసాడు. ట్రాన్స్పోర్ట్ వ్యాపారం చూసుకుంటున్నాడు. మా పెళ్లికి ఎవరూ మాకు సహాయం చేయలేదు, మద్దతు ఇవ్వకపోవడంతో మేము ఇంటి నుండి బయటికి వచ్చాము. మేము ఇప్పుడు వివాహం చేసుకున్నాము. అతని కుటుంబ సభ్యులు, స్నేహితులను ఎవరూ బెదిరించవద్దు" అని ఆమె చెప్పింది.
గత ఆగస్టులో తాము ఇంటి నుంచి బయటకు వెళ్లామని, పోలీసులు తమను ఇంటికి తీసుకొచ్చారని, సతీష్‌ను రెండు నెలల పాటు అక్రమ కస్టడీలో ఉంచారని జయకళ్యాణి తెలిపింది. "అతని (సతీష్) తల్లిదండ్రులు, స్నేహితులు పోలీసుల అదుపులో ఉన్నారు. మా నాన్న తనపై చాలా తప్పుడు ఫిర్యాదులు నమోదు చేశారు, మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. నా తండ్రి తమిళనాడులో మంత్రి కాబట్టి మాకు ఎవరూ సహాయం చేయడం లేదు. కర్ణాటక పోలీసుల సహాయం కోసం మేము ఇక్కడికి వచ్చాము. మా ప్రాణాలకు ముప్పు ఉంది, అతని కుటుంబానికి భద్రత కావాలి, "అని ఆమె తెలిపింది. కర్ణాటకలోని విజయనగర్ జిల్లా హిరేహడగలిలోని హాలస్వామి మఠంలో వీరిద్దరి వివాహం జరిగింది.