తమిళనాడులో బీజేపీ హవా మొదలైనట్లేనా
Tamil Nadu local body elections.. BJP spreads its reach in most parts of state. దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక కాకుండా మిగిలిన రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ సత్తా చాటాలని అనుకుంటూ ఉంది.
By M.S.R Published on 23 Feb 2022 1:24 PM GMTదక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక కాకుండా మిగిలిన రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ సత్తా చాటాలని అనుకుంటూ ఉంది. తాజాగా తమిళనాడులో మంగళవారం నాడు వెలువడిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ మంచి ఫలితాలనే సాధించింది. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగరపంచాయతీలకు జరిగిన ఎన్నికల కౌంటింగ్ లో భాగంగా కన్యాకుమారి జిల్లాలో కాషాయ పార్టీ మెజారిటీ వార్డులను గెలుచుకుంది. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో నాగర్‌కోయిల్ కార్పొరేషన్‌లో ఆరు వార్డులు, బవానీసాగర్, సత్యమంగళం ఎంసీల్లోని కొన్ని వార్డులను బీజేపీ కైవసం చేసుకుంది.
చెన్నైలో ఆసక్తికరంగా అన్నాడీఎంకే కంటే కొన్ని వార్డుల్లో బీజేపీ రెండో స్థానంలో నిలిచింది. చెన్నైలో కనీసం 5 వార్డుల్లో అన్నాడీఎంకేను వెనక్కి నెట్టి బీజేపీ రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. 174వ వార్డులో డీఎంకే అభ్యర్థి రాధిక 4960 ఓట్ల తేడాతో గెలుపొందగా, బీజేపీ 1847 ఓట్లతో రెండో స్థానంలో నిలవగా, అన్నాడీఎంకే 1403 ఓట్లతో మూడో స్థానంలో నిలిచింది. కన్యాకుమారి మున్సిపాలిటీలో మొత్తం 15 వార్డులకు 12 చోట్ల బీజేపీ విజయం సాధించింది. తమిళనాడులో 2011లో జరిగిన గత ఎన్నికలతో పోల్చితే, ఈసారి పట్టణ స్థానిక సంస్థల్లో పార్టీ దక్కించుకున్న వార్డుల సంఖ్యను పెంచుకోగలిగింది. రాత్రి 7.50 గంటల నాటికి బీజేపీ 22 కార్పొరేషన్ వార్డులలో విజయం సాధించింది. 56 మున్సిపాలిటీ వార్డులు, 230 పట్టణ పంచాయతీ వార్డులలో విజయం సాధించింది.
2011లో నాలుగు కార్పొరేషన్ వార్డులు, 37 మున్సిపాలిటీ వార్డులు, 185 టౌన్ పంచాయతీ వార్డులను బీజేపీ గెలుచుకుంది. చెన్నై కార్పొరేషన్‌లోని 134వ వార్డు నుంచి బీజేపీ అభ్యర్థి ఉమా ఆనందన్ కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. తిరునల్వేలిలోని పనగుడి పట్టణ పంచాయతీలోని నాలుగో వార్డులో కూడా బీజేపీ అభ్యర్థి లక్కీ డ్రా ద్వారా గెలిచారు. ఏఐఏడీఎంకే, బీజేపీ అభ్యర్థులు 266 ఓట్లు సాధించడంతో లక్కీ డ్రా పద్ధతిలో విజేతను ఎన్నుకోవాలని నిర్ణయించారు. డ్రాలో బీజేపీ అభ్యర్థి మనువేల్‌ను విజేతగా ప్రకటించారు.