భారీ వర్షాల హెచ్చరిక కారణంగా చెన్నైలోని అన్ని పాఠశాలలకు బుధవారం నాడు సెలవులు ప్రకటించినట్లు చెన్నై జిల్లా కలెక్టర్ రష్మి సిద్ధార్థ్ ఒక ప్రకటనలో తెలిపారు. కడలూరు, విల్లుపురం, రాణిపేట జిల్లా కలెక్టర్లు కూడా తమ తమ జిల్లాల్లోని పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు. తూత్తుకుడిలో పాఠశాలలు మూసివేస్తున్నట్లు అధికారులు మంగళవారం నాడు తెలిపారు. భారీ వర్షాలు కురుస్తాయని అంచనాల నేపథ్యంలో పుదుచ్చేరి, కారైకల్ పరిపాలన యంత్రాంగాలు బుధవారం పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించాయి.
చెన్నైలోని ఐకానిక్ మెరీనా బీచ్ వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారుతోంది. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో తీరప్రాంతంలో అలలు, బలమైన గాలులు వీస్తున్నాయి. రాబోయే రెండు రోజులు సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు మత్స్యకారులు, తీరప్రాంత నివాసితులు అప్రమత్తంగా ఉండాలని, అధికారుల భద్రతా సలహాలను పాటించాలని కోరారు. చెన్నైలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం (RMC) రాబోయే నాలుగు రోజుల పాటు తమిళనాడులోని వివిధ ప్రాంతాలకు నారింజ, పసుపు రంగు హెచ్చరికలను జారీ చేసింది.