2.5 టన్నుల టమోటాలతో వెళ్తున్న ట్రక్కును హైజాక్ చేసిన తమిళనాడుకు చెందిన దంపతులను బెంగళూరులో పోలీసులు అరెస్టు చేశారు. ట్రక్కు డ్రైవర్ నుంచి డబ్బు వసూలు చేసేందుకు వారు ఫేక్ యాక్సిడెంట్‌ని సృష్టించారని పోలీసులు తెలిపారు. వేలూరుకు చెందిన దంపతులు హైవే దొంగల ముఠాలో భాగమని, జూలై 8న చిత్రదుర్గ జిల్లా హిరియూరుకు చెందిన రైతు మల్లేష్‌ను చిక్కజాల వద్ద అడ్డగించి, తన ట్రక్కు తమ కారును ఢీకొట్టిందని పేర్కొంటూ పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. రైతు డబ్బులు చెల్లించడానికి నిరాకరించడంతో, అతడిపై దాడి చేశారు.
ఆ తర్వాత 2.5 లక్షల రూపాయలకు పైగా విలువైన టమోటాలు లోడ్ చేసిన వాహనంతో పరారయ్యారు. ఇటీవల దేశవ్యాప్తంగా మార్కెట్లో టొమాటో ధరలు కిలో రూ.100కిపైగా చేరాయి. రైతు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆర్ఎంసీ యార్డు పోలీసులు వాహనం తరలింపుపై నిఘా పెట్టి ముఠా గుట్టు రట్టు చేశారు. భాస్కర్ (28), అతని భార్య సింధూజ (26)లను శనివారం అరెస్టు చేయగా, మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మల్లేష్ కోలారుకు టమాటా రవాణా చేస్తుండగా.. దొంగల ముఠా అతడిని అడ్డగించి ఈ తతంగానికి పాల్పడింది. ప్రస్తుతం ఈ ఘటన కర్ణాటక, తమిళనాడులో హాట్ టాపిక్‌గా మారింది.