తమిళనాడు ప్రభుత్వంతో చేపట్టిన వేతన చర్చలు విఫలం కావడంతో రేపటి నుంచి ఆ రాష్ట్ర కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి. 80 లక్షల కిలోమీటర్ల మేర ప్రభుత్వ బస్సులు తిరుగుతున్నందున సమ్మె చేస్తే.. ప్రతి రోజు కనీసం రూ.10 నుంచి రూ.16 కోట్ల వరకు నష్టం వస్తుందని అధికారులు చెబుతున్నారు. చర్చలు అర్ధాంతరంగా ఉన్నప్పుడు సమ్మెకు దిగడం అన్యాయమని, మూడు రౌండ్ల చర్చలు మాత్రమే జరిగాయని రవాణా శాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. రవాణా సంస్థలు ఇప్పటికే నష్టాల్లో నడుస్తున్నాయన్నారు. దీంతో కార్మికులు చేసిన డిమాండ్లు తీర్చేందుకు కొంత సమయం పడుతుందని తెలిపారు. 13 వ వేతన ఒప్పందం 2019 సెప్టెంబర్ 1 తో ముగిసింది.
రవాణా కార్మిక సంఘాలు లేబర్ ప్రోగ్రెసివ్ ఫెడరేషన్ (ఎల్పీఎఫ్), ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఐఎన్‌టీయూసీ), సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సీఐటీయూ), హింద్ మజ్దూర్ సభ (హెచ్‌ఎంఎస్), ఆలిండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ) ఒక ప్రకటనలో ప్రకటించాయి. ఈ సమ్మెలో మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌తో పాటు ఎనిమిది రాష్ట్ర రవాణా సంస్థలు పాల్గొంటున్నాయి. దీంతో 80 శాతం బస్సులు రోడ్డెక్కవు. బస్సులు నడవకుంటే సామాన్య ప్రజానికానికి ఇబ్బందులు తప్పవు.