కరోనా కట్టడి కోసం దేశంలోని అన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్, కర్ఫ్యూ వంటి ఏదో ఒక మార్గాన్ని అనుసరిస్తున్నాయి. ఒక్కో రాష్ట్రం లో ఒక్కోలా వెసులుబాట్లు అమలు చేస్తున్నారు. తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే నిత్యావసరాల కోసం బయటకు వెళ్లేందుకు వెసులుబాటు కల్పిస్తుండగా ఆంధ్రా లో మధ్యాహ్నం 12 రోడ్లపైకి జనాలను అనుమతిస్తున్నారు అయితే వెసులుబాటు సమయం ముగిసిన తర్వాత రోడ్డు ఎక్కిన వాళ్ళ పని పడుతున్నారు పోలీసులు.
అయితే కొన్ని చోట్ల పోలీసులు, అధికారులు విసిగిపోయో మరో కారణాలతోనో లాక్‌డౌన్ ఆంక్షలు అమలవుతున్న టైంలో రోడ్డెక్కిన వారిపై ప్రతాపం చూపిస్తున్నారు. తాజాగా ఛత్తీస్‌గఢ్‌లో ఏకంగా జిల్లా కలెక్టరే ఓ యువకుడిపై చెయ్యి చేసుకున్నారు. శనివారం రోజున లాక్‌డౌన్ ఆంక్షలు అమల్లో ఉన్న టైం లో సూరజ్‌పూర్‌లో ఓ యువకుడు ఇంటినుంచి బయటకు వచ్చాడు. మాస్క్ పెట్టుకున్న అతడు కలెక్టర్ రణబీర్ శర్మకు ఒక కాగితంతో పాటు మొబైల్ ఫోన్‌లో ఏదో చూపించడానికి ప్రయత్నం చేశాడు.
అయితే అతని చేతి నుంచి ఫోన్ లాకొన్న కలెక్టర్ దానిని నేలకేసి కొట్టారు. యువకునిపై చేయిచేసుకున్నారు. కలెక్టర్ ఆదేశంతో సంఘటనా స్థలంలో ఉన్న పోలీసులు కూడా ఆ యువకుడిని కర్రతో కొట్టారు. వీడియో వైరల్ అయిన నేపధ్యంలో కలెక్టర్ పై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో కలెక్టర్ క్షమాపణలు కోరారు. ఆ యువకుడిని అగౌరవపరిచే ఉద్దేశం తనకు లేదనీ, అతను వరుసగా అబద్ధాలు ఆడటం వలనే కోపంతో అలా చేశానన్నారు. సూరజ్‌పూర్ జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నాయని, అందరూ సమిష్టి గా కృషి చేసినప్పుడే కరోనా కట్టడి సాధ్యం అవుతుందన్నారు. అయితే సోషల్ మీడియా వేదికగా కలెక్టర్ క్షమాపణాలు చెప్పినప్పటికి అతనిపై వేటు తప్పలేదు. రన్బీర్ శర్మను విధుల నుంచి తొలగిస్తూ చత్తీస్‌ఘడ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ అదేశాలు జారీ చేశారు.