విరసం నేత వరవరరావుకు సుప్రీంకోర్టు బెయిల్.. అది కూడా షరతులతో..
Supremecourt grants bail to Varavara Rao. ప్రముఖ తెలుగు కవి, జర్నలిస్టు, అధ్యాపకుడు పి.వరవరరావు (84)కి వైద్య కారణాలతో సుప్రీంకోర్టు బుధవారం బెయిల్
By అంజి
ప్రముఖ తెలుగు కవి, జర్నలిస్టు, అధ్యాపకుడు పి.వరవరరావు (84)కి వైద్య కారణాలతో సుప్రీంకోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. ప్రధాని మోదీని హత్య చేసేందుకు ప్రయత్నించిన భీమా కోరెగావ్ కేసులో వరవరరావు 2018 నుంచి జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. బొంబాయి హైకోర్టు తనకు వైద్యపరమైన కారణాలతో శాశ్వత బెయిల్ మంజూరు చేయకపోవడాన్ని సవాలు చేస్తూ వరవరరావు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌పై న్యాయమూర్తులు యుయు లలిత్, అనిరుద్ధ బోస్, సుధాన్షు ధులియాతో కూడిన ధర్మాసనం ఈ ఉత్తర్వును జారీ చేసింది.
హైదరాబాద్‌కు చెందిన వరవరరావు (84) అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. మావోయిస్టు సంస్థలతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై వరవరరావుపై భీమా కొరెగాన్ కేసులో చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) కింద కేసు నమోదైంది. నాలుగు సంవత్సరాల క్రితం ఆగష్టు 28, 2018న ఈ కేసులో రావును అరెస్టు చేశారు. నవంబర్ 2018లో ముంబైలోని తలోజా జైలుకు తీసుకెళ్లారు. 2020లో, అతని ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలించారు. ఫిబ్రవరి 2021లో, హైకోర్టు అతనికి 6 నెలల మెడికల్ బెయిల్‌ను అనుమతించింది.
ఆ తర్వాత మెడికల్ బెయిల్ మళ్లీ పొడిగించారు. అయితే ఈ ఏడాది ఏప్రిల్ 13న ఆయనకు శాశ్వత బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరించిన హైకోర్టు మెడికల్ బెయిల్‌ను తాత్కాలికంగా మరో మూడు నెలలు పొడిగించింది. మూడు నెలల వ్యవధి తర్వాత జైలులో లొంగిపోవాలని కోరారు. ఈ కేసులో ఇంకా విచారణ ప్రారంభం కాలేదని, ఛార్జ్ షీట్ దాఖలు చేసినప్పటికీ అభియోగాలు కూడా నమోదు కాలేదని ధర్మాసనం పేర్కొంది. ముంబైలోని ప్రత్యేక ఎన్‌ఐఏ కోర్టు నుండి అనుమతి లేకుండా వరవరరావు గ్రేటర్ ముంబై ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్లకూడదని ఆదేశించింది.
బెయిల్ కేవలం వైద్యపరమైన కారణాలపైనే మంజూరయ్యిందని, ఈ అంశంలోని మెరిట్‌లను ప్రతిబింబించబోమని ధర్మాసనం స్పష్టం చేసింది. వరవరరావు జ్యుడీషియల్ కస్టడీకి వెళ్లే ముందు నుంచి పైల్స్, థైరాయిడ్ సమస్యలు, ప్రోస్టేట్ గ్రంథి పెరుగుదల, కరోనరీ ఆర్టిలరీ సమస్యలు, అసిడిటీ మరియు మైగ్రేన్ సైనెసిస్ వంటి అనేక వ్యాధులతో బాధపడుతున్నారు.
జైలులో ఉన్నప్పుడు వరవరరావు 2020 మే 29న అస్వస్థతకు గురయ్యారు. దీంతో రావును మహారాష్ట్రలోని తలోజా జైలు నుంచి జేజే ఆస్పత్రికి తరలించారు. ఇది ఆయన సన్నిహితులను దిగ్భ్రాంతికి గురిచేసింది. అతని ఆరోగ్యం నిలకడగానే ఉందని జేజే హాస్పిటల్ బులెటిన్ విడుదల చేసే వరకు అతని అనారోగ్యం గురించి కుటుంబ సభ్యులు అందోళన చెందారు. ఆ తర్వాత వరవరరావును హైదరాబాద్‌కు తరలించాలని కుటుంబసభ్యులు మరో పిటిషన్ వేశారు
హైదరాబాద్‌కు వెళ్లేందుకు అనుమతించాలంటూ వరవరరావు కుటుంబం సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేసింది.
వరవరరావు బావమరిది వేణుగోపాల్ వీక్షణం న్యూస్‌మీటర్‌తో మాట్లాడుతూ.. "అత్యున్నత న్యాయస్థానం నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాము. రావును మార్చి 2021 నుండి బాంబే హైకోర్టు 6 నెలల పాటు బెయిల్‌పై విడుదల చేసింది. కొన్ని నెలల తర్వాత సుప్రీంకోర్టు ఎటువంటి సమయ పరిమితులు లేకుండా బెయిల్ మంజూరు చేసింది. కానీ, అతను తన కుటుంబంతో కలిసి హైదరాబాద్‌లో ఉండేలా షరతును సవరించాలని కోరుతూ మేము మరొక పిటిషన్‌ను కూడా దాఖలు చేసాము.'' అని చెప్పారు.