ఎస్సీ, ఎస్టీల వర్గీకరణ.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు
ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణపై ఎంఆర్‌పీఎస్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.
By అంజి Published on 1 Aug 2024 6:13 AM GMTఎస్సీ, ఎస్టీల వర్గీకరణ.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు
ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణపై ఎంఆర్‌పీఎస్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ అవసరమని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం 6:1 నిష్పత్తితో తీర్పు వెలువరించింది. దీని వల్ల ఎస్సీ, ఎస్టీల్లోని వెనుకబడిన కులాలకు లబ్ధి జరుగుతుందని అభిప్రాయపడింది. కాగా ధర్మాసనం సభ్యుల్లో ఒకరైన జస్టిస్ బేలా త్రివేది విభేదించారు.
వెనుకబడిన వర్గాలలో మరింత అట్టడుగున ఉన్న వారికి ప్రత్యేక కోటాలను మంజూరు చేయడానికి షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల ఉప-వర్గీకరణ అనుమతించబడుతుందని సుప్రీంకోర్టు గురువారం పేర్కొంది. భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) DY చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం, రిజర్వేషన్ల ప్రయోజనం కోసం SCలలో ఉప-వర్గాలను సృష్టించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదంటూ 2005లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును తోసిపుచ్చింది. "రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 కింద పొందుపరచబడిన సమానత్వ సూత్రాన్ని ఉప-వర్గీకరణ ఉల్లంఘించదు" అని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.
ఎస్సీ, ఎస్టీ కులాల్లో అంతర్గతంగా రిజర్వేషన్లు అందరికీ సమానంగా అందడం లేదనే వాదనతో ఈ వర్గీకరణ డిమాండ్ మొదలైంది. ఉదాహరణకు 2011 జనాభా లెక్కల ప్రకారం.. ఏపీలోని ఎస్సీ జనాభా 1,38,78,078. అందులో మాదిగలు 67 లక్షలు. మాలలు 55 లక్షలు. అంటే మాలల కంటే మాదిగలు 12 లక్షలు ఎక్కువ. అయితే జనాభాలో ఎక్కువ ఉన్న తమకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు అందడం లేదనేది వాదన. అందుకే ఎస్సీల్లోనూ ఏ,బీ,సీ,డీ ఉప కులాలుగా వర్గీకరించాలంటున్నారు.