శశి థరూర్ ను అరెస్టు చేయకండి

Supreme Court says Shashi Tharoor won't be arrested for now.కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ తో పాటు ఆరుగురు జర్నలిస్టులను విచారణ పేరుతో ఎవరూ అరెస్ట్ చేయకూడదని సుప్రీంకోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Feb 2021 1:23 PM GMT
Supreme Court says Shashi Tharoor wont be arrested for now

కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ తో పాటు ఆరుగురు జర్నలిస్టులను విచారణ పేరుతో ఎవరూ అరెస్ట్ చేయకూడదని సుప్రీంకోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును రెండు వారాల తర్వాత విచారిస్తామని చెప్పింది. గణతంత్ర దినోత్సవం రోజున ట్రాక్టర్ ర్యాలీ నేపథ్యంలో హింస చెలరేగిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ట్వీట్లు చేసిన నేపథ్యంలో జర్నలిస్టులపై కేసులు నమోదయ్యాయి. కేసులు ఎదుర్కొంటున్న జర్నలిస్టుల్లో రాజ్ దీప్ సర్దేశాయ్, మృణాల్ పాండే, జాఫర్ అఘా, వినోద్ కే జోస్, పరేశ్ నాథ్, అనంత్ నాథ్ ఉన్నారు.

ఢిల్లీ పోలీసుల తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ.. ఈ కేసులో వీరికి ఎలాంటి ఊరటను కల్పించవద్దని కోర్టును కోరారు. శశి థరూర్ తరపున కాంగ్రెస్ నేత, సీనియర్ అడ్వొకేట్ కపిల్ సిబాల్ వాదనలు వినిపిస్తూ సుప్రీంకోర్టు ఈ కేసును విచారించేంత వరకు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలను ఇవ్వాలని కోరారు. చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని జస్టిస్ బోపన్న, రామసుబ్రహ్మణియన్ లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ వాదనలను విన్న తర్వాత స్పందిస్తూ... తాము కేసును విచారించేంత వరకు ఏమీ జరగబోదని దీనికి సంబంధించి నోటీసులు ఇస్తున్నామని తెలిపింది.

మరో వైపు కిసాన్ ర్యాలీలో అల్ల‌ర్ల‌కు కార‌ణ‌మైన పంజాబీ గాయ‌కుడు, న‌టుడు దీప్ సిద్ధూను ఢిల్లీ స్పెష‌ల్ సెల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గ‌ణ‌తంత్ర దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌కోట వ‌ద్ద జ‌రిగిన హింసాకాండ కేసులో ప్ర‌ధాన నిందితుడైన దీప్ సిద్దూ.. అప్ప‌టి నుంచి అజ్ఞాతంలో ఉండ‌గా ఢిల్లీ పోలీసులు ఎట్ట‌కేల‌కు అరెస్టు చేశారు.




Next Story