ఓటర్లకు ఉచితాలపై సుప్రీం విచారణ, రెండు రాష్ట్రాలకు నోటీసులు
ఓటర్లకు ఉచితాలు పంపిణీ చేస్తున్నారన్న పిల్‌పై సుప్రీంకోర్టు విచారించింది.
By Srikanth Gundamalla Published on 6 Oct 2023 2:30 PM IST
ఓటర్లకు ఉచితాలపై సుప్రీం విచారణ, రెండు రాష్ట్రాలకు నోటీసులు
రాజస్థాన్, మధ్యప్రదశ్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే.. ఎన్నికల నేపథ్యంలో అక్కడ ప్రభుత్వాలు ఓటర్లకు ఉచితాలు పంపిణీ చేస్తున్నాయని ఆరోపిస్తూ సుప్రీంకోర్టులో పిల్ దాఖలు అయ్యింది. ఈ పిటిషన్‌పై సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్ధివాలా, జస్టిజ్ మనోజ్ మిశ్రాతో కూడి ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేస్తూ మధ్యపద్రేశ్, రాజస్థాన్ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. అంతేకాదు.. కేంద్రం, ఎన్నికల సంఘం, రిజర్వ్ బయాంక్ ఆఫ్ ఇండియాకు ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు.
మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల ప్రభుత్వాలు పన్ను చెల్లింపుదారుల సొమ్ముని దుర్వినియోగం చేస్తున్నాయని ఆరోపిస్తూ భట్టూలాల్ జైన్ అనే వ్యక్తి సుప్రీంకోర్టు పిల్ దాఖలు చేశారు. ఉచితాల కారణంగా రాష్ట్రాలు అప్పుల ఊబిలో చిక్కుకుపోతున్నాయని పిటిషన్‌దారుడు పేర్కొన్నారు. ఈ పిల్‌పై ఈ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు తమ అభిప్రాయాలు తెలపాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. విచారణ సందర్భంగా..ప్రభుత్వాలు ఎన్నికలకు ముందు నగదు పంపిణీ చేయడం కంటే దారుణం మరోటి ఉండదని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టు ముందు వాదనలు వినిపించారు. ఇది ప్రతీసారి జరుగుతోందని చెప్పారు. అయితే.. ఈ భారం చివరకు పన్ను చెల్లింపుదారులపై పడుతుందని సుప్రీంకోర్టుకు తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చే రాజకీయ ప్రమాణాలను అడ్డుకోవడం సాధ్యం కాదని సీజేఐ పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై సమాధానం ఇవ్వాలని నాలుగు వారాల గడువు ఇచ్చింది సుప్రీంకోర్టు.
కొన్నాళ్ల క్రితం ఎన్నికల వేళ పార్టీలు ఇస్తున్న ఉచితాలను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. రాజకీయ పార్టీలు ఇస్తున్న ఉచిత హామీలు తీవ్రమైన అంశమని పేర్కొంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఎందుకు ఏర్పాటు చేయడం లేదని ప్రశ్నించింది. ఉచితాలు దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేయబోతున్నాయని వ్యాఖ్యానించింది.