దేశ రాజధానిలో పాలనాధికారం.. ఢిల్లీ సర్కార్‌దే కానీ..: సుప్రీంకోర్టు
దేశ రాజధాని ఢిల్లీలో పాలనా వ్యవహారాలపై నియంత్రణాధికారం ఎవరికి ఉండాలనే అంశంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది.
By అంజి Published on 11 May 2023 8:45 AM GMTదేశ రాజధాని ఢిల్లీలో పాలనా వ్యవహారాలపై నియంత్రణాధికారం ఎవరికి ఉండాలనే అంశంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. సుప్రీంకోర్టు తీర్పుతో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నుంచి భారీ విజయం లభించింది. ప్రభుత్వ అధికారులపై ఎన్నికైన సర్కార్‌కే అన్ని అధికారాలు ఉంటాయని భారత ఉన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఐదుగురు సభ్యుల ధర్మాసనం గురువారం నాడు ఏకగీవ్ర తీర్పు చెప్పింది. ఎన్నికైన ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు లెఫ్టినెంట్ గవర్నర్ కట్టుబడి ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ల్యాండ్, పోలీస్, లా అండ్ ఆర్డర్ మినహా.. సర్వ అధికారాలు ఢిల్లీ సర్కార్ చేతుల్లో ఉంటాయని సుప్రీం స్పష్టం చేసింది.
ప్రజాస్వామ్య ప్రభుత్వంలో అసలైన అధికారాలు.. ప్రజలు ఎన్నికున్న ప్రజాప్రతినిధుల చేతుల్లోనే ఉండాలని సుప్రీంకోర్టు పేర్కొంది. రాజ్యాంగంలో ప్రజాస్వామ్యం, ఫెడరల్ విధానాలు భాగమని, ఇక పాలన వ్యవహారాలపై నియంత్రణ ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వానిదేనని ధర్మాసనం తెలిపింది. అధికారులు మంత్రులకు రిపోర్ట్ చేయకపోయినా, ఆర్డర్స్‌ని పాటించకపోయినా.. సమగ్ర పాలనా విధానాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని సుప్రీంకోర్టు తెలిపింది. ఢిల్లీ.. అన్ని కేంద్ర పాలిత ప్రాంతాల మాదిరిగా ఉండదని, ఢిల్లీ దేశ రాజధాని కాబట్టి.. దీనికి ప్రత్యేక స్వరూపం ఉంటుందని తెలిపింది. అయితే ఇక్కడ పాలనా సర్వీసులపై అసలైన అధికారాలు ప్రజాప్రతినిధులతో కూడిన ప్రభుత్వానికే ఉంటాయని ధర్మాసనం తేల్చి చెప్పింది.
ఢిల్లీలో పాలనా వ్యవహారాలపై పూర్తి నియంత్రణ కేంద్ర ప్రభుత్వానికే ఉంటుందని 2015లో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిని అరవింద్ కేజ్రీవాల్ సర్కార్.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. అక్కడ సరైన ఫలితం రాకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై సుదీర్ఘ విచారణ అనంతరం 2019 ఫిబ్రవరి 14న ఈ వివాదంపై సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం భిన్నాభిప్రాయ తీర్పును వెలువరించింది. పాలనా సర్వీసులపై ఢిల్లీ ప్రభుత్వానికి ఎలాంటి అధికారాలు లేవని జస్టిస్ అశోక్ భూషణ్ చెప్పగా.. జస్టిస్ ఏకే సిక్రి దాన్ని వ్యతిరేకించారు. తాజాగా దీనిపై విచారణ జరిపిన రాజ్యాంగ ధర్మాసనం నేడు తీర్పు వెలువరించింది. ఈ క్రమంలోనే జస్టిస్ అశోక్ భూషణ్ ఇచ్చిన తీర్పును విస్తృత ధర్మాసనం తోసిపుచ్చింది.