వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణ రాజుకు ఎట్టకేలకు బెయిల్ మంజూరు అయింది. సుప్రీంకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగిన అనంతరం రఘురామ కృష్ణ రాజుకు బెయిల్ ను మంజూరు చేస్తూ ధర్మాసనం తీర్పును ఇచ్చింది. రఘురామ కృష్ణ రాజుకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం సుప్రీంలో బెయిల్ పిటిషన్ వేయడం సబబేనని వ్యాఖ్యానించింది. సొంత పూచీకత్తు, ఇద్దరు జామీనుదారులతో, లక్ష రూపాయల షూరిటీ బాండ్లతో బెయిల్ తీసుకోవచ్చని పేర్కొంది.
గుంటూరు సీఐడీ కోర్టులో వీటిని దాఖలు చేసి బెయిల్ తీసుకోవాలని సూచించింది. దర్యాప్తు అధికారి పిలిస్తే విచారణకు వెళ్లాలి. ముఖ్యంగా న్యాయవాది సమక్షంలో విచారణ జరగాలని సుప్రీంకోర్టు తెలిపింది. అంతేకాకుండా ఈ కేసుకు సంబంధించి మీడియాతో మాట్లాడకూడదని సూచన చేసింది. రఘురామ కృష్ణరాజు దర్యాప్తును ప్రభావితం చేయకూడదని సుప్రీం తెలిపింది. ముఖ్యంగా మీడియా, సోషల్ మీడియాలో ఎలాంటి ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని చెప్పింది. ఎంపీ తరఫున ముకుల్ రోహత్గీ, ప్రభుత్వం తరఫున దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం బెయిల్‌ను మంజూరు చేసింది.