న్యాయమూర్తుల ఆస్తుల వివరాలను వెల్లడించిన సుప్రీంకోర్టు
సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఆస్తులను తన అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయడం ద్వారా వాటిని ప్రజలకు అందుబాటులో ఉంచాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది.
By అంజి
న్యాయమూర్తుల ఆస్తుల వివరాలను వెల్లడించిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఆస్తులను తన అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయడం ద్వారా వాటిని ప్రజలకు అందుబాటులో ఉంచాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. "భారత సుప్రీంకోర్టు 2025 ఏప్రిల్ 1న న్యాయమూర్తుల ఆస్తుల వివరాలను కోర్టు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయడం ద్వారా పబ్లిక్ డొమైన్‌లో ఉంచాలని నిర్ణయించింది. ఇప్పటికే స్వీకరించిన న్యాయమూర్తుల ఆస్తుల ప్రకటనలు అప్‌లోడ్ చేయబడుతున్నాయి. ప్రస్తుత ఆస్తుల ప్రకటన అందిన వెంటనే ఇతర న్యాయమూర్తుల ఆస్తుల ప్రకటన అప్‌లోడ్ చేయబడుతుంది" అని సుప్రీంకోర్టు విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలిపింది.
న్యాయవ్యవస్థలో పారదర్శకత కోసం, సుప్రీంకోర్టు న్యాయమూర్తులందరూ తమ ఆస్తులను ప్రకటించి, ఆ వివరాలను సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయడానికి అంగీకరించారు. మార్చి 14న ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి నివాసంలో భారీగా నగదు పట్టుబడిన ఘటన నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతర్గత విచారణ మధ్య, న్యాయమూర్తిని అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలని సిఫార్సు చేయబడింది. ప్రస్తుతం సుప్రీంకోర్టు 33 మంది న్యాయమూర్తులతో పనిచేస్తున్నప్పటికీ, అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ఇప్పటివరకు 21 మంది న్యాయమూర్తులు తమ ఆస్తుల ప్రకటనలను అప్‌లోడ్ చేశారు.
ఈ క్రమంలో న్యాయమూర్తుల్లో అత్యంత రిచెస్ట్ న్యాయమూర్తి జస్టిస్ కె.వి విశ్వనాథన్ అని లెక్కలు చెబుతున్నాయి. ఆయన తన ఆస్తుల వివరాలను సుప్రీం కోర్టు అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపర్చారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ కన్నాకు బ్యాంక్ అకౌంట్లో రూ.55.75 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్స్ , పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌లో రూ. 1.06 కోట్లు ఉన్నాయి. ఫుల్ కోర్ట్ యొక్క తాజా తీర్మానం ప్రకారం, సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో ఆస్తుల ప్రకటనను ఉంచడం “తప్పనిసరి” అవుతుంది. అంతకుముందు, సుప్రీంకోర్టు, మే 7, 1997న జరిగిన ఫుల్ కోర్ట్ సమావేశంలో, ప్రతి న్యాయమూర్తి తన అన్ని ఆస్తులను రియల్ ఎస్టేట్ లేదా పెట్టుబడుల రూపంలో (తన పేరు మీద లేదా తన జీవిత భాగస్వామి లేదా అతనిపై ఆధారపడిన ఎవరైనా వ్యక్తి పేరుతో కలిగి ఉన్న) పదవీ బాధ్యతలు స్వీకరించిన సముచిత సమయంలో ప్రకటించాలని నిర్ణయించింది.