సెంట్ర‌ల్ విస్టా ప్రాజెక్ట్‌కు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్న‌ల్‌

Supreme Court clears central vista redevelopment project.ఢిల్లీలో ఇండియా గేట్ నుంచి రాష్ట్రపతి భవనం వరకు మ‌రింత‌ అభివృద్ధి చేసేందుకు సెంట్ర‌ల్ విస్టా ప్రాజెక్ట్‌కు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్న‌ల్‌.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 Jan 2021 2:50 PM IST
central vista

ఢిల్లీలో ఇండియా గేట్ నుంచి రాష్ట్రపతి భవనం వరకు మ‌రింత‌ అభివృద్ధి చేసేందుకు రూ. 20,000 కోట్లతో కేంద్రం త‌ల‌‌పెట్టిన సెంట్ర‌ల్ విస్టా ప్రాజెక్టుకు సుప్రీంకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. కొత్త పార్లమెంట్‌కు అన్ని అనుమతులు సరిగ్గా ఉన్నాయని తీర్పును వెలువరించింది జస్టిస్ ఏ.ఎమ్. ఖానవిల్కర్, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడిన ధర్మాసనం. డీడీఏ చ‌ట్టం కింద చేప‌ట్టిన ఈ ప్రాజెక్టు చ‌ట్ట‌బ‌ద్ద‌మైన‌దేన‌ని, ప‌ర్యావ‌ర‌ణ మంత్రిత్వ శాఖ ఇచ్చిన అనుమ‌తులు, స్థలం కేటాయింపులు కూడా స‌రిగ్గానే ఉన్నాయ‌ని న్యాయ‌స్థానం తెలిపింది. ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాల్లో కాలుష్యాన్ని త‌గ్గించే స్మాగ్ ట‌వ‌ర్లు ఏర్పాటు చేయాల‌ని, యాంటీ స్మాగ్ గ‌న్నుల‌ను ఉప‌యోగించాల‌ని ఆదేశించింది. ‌

కొత్త పార్లమెంట్ భవన నిర్మాణం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ప‌లు పిటిష‌న్లు దాఖలయ్యాయి. వీటిపై ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. సెంట్రల్ విస్టా ప్రాజెక్టుపై కేంద్ర ప్ర‌భుత్వం చేసిన‌ వాదనలతో త్రిసభ్య ధర్మాసనం ఏకీభవించి 2-1 మెజార్టీతో తీర్పు చెప్పింది. ప్రాజెక్టు నిర్మాణాలకు హెరిటేజ్‌ కన్జర్వేషన్‌ కమిటీ అనుమతి అవసరమని అనుమతులు తెచ్చుకోవాలని సూచించింది. సెంట్రల్ విస్టా కోసం గుజరాత్‌కు చెందిన సంస్థ హెచ్‌సీపీ డిజైన్, ప్లానింగ్ అండ్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ప్లాన్ అందించిన విష‌యం తెలిసిందే.

2022 ఆగస్టు 15 నాటికి పార్లమెంట్ భ‌వ‌న నిర్మాణ ప్రాజెక్టును పూర్తి చేయ‌నున్నారు. అలాగే, కేంద్ర సచివాలయాన్ని 2024 నాటికి పూర్తి చేస్తారు. గతేడాది డిసెంబరు 10న ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ సెంట్ర‌ల్ విస్టాకు శంకుస్థాప‌న చేశారు.


Next Story