ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు గ‌ట్టి షాక్‌

ఎక్సైజ్ పాలసీ వ్యవహారంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టు నుంచి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది

By Medi Samrat  Published on  4 Jun 2024 4:22 PM IST
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు గ‌ట్టి షాక్‌

ఎక్సైజ్ పాలసీ వ్యవహారంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టు నుంచి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. సిసోడియా బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. ఈ కేసులో ఢిల్లీ హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సిసోడియా సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సీబీఐ నమోదు చేసిన కేసుల్లో సిసోడియా బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది.

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి), సిబిఐ ఛార్జిషీట్లు దాఖలు చేసిన తర్వాత సిసోడియా బెయిల్ కోసం మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ముందు ఈడీ, సీబీఐ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. జులై 3లోగా దర్యాప్తు సంస్థలు చార్జిషీట్‌ను దాఖలు చేయనున్నాయని తెలిపారు.

సిసోడియా తరఫున న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ కోర్టుకు హాజరయ్యారు. సుప్రీంకోర్టు బెయిల్‌ను డిమాండ్ చేస్తూ.. సిసోడియాను 15 నెలలుగా కస్టడీలో ఉంచారని.. కేసు విచార‌ణ ఇంకా పూర్తికాలేద‌ని అన్నారు. అయితే, సిసోడియా బెయిల్ పిటిషన్‌ను ప్రస్తుతం విచారించలేమని కోర్టు తెలిపింది.

17 నవంబర్ 2021న ఢిల్లీ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త ఎక్సైజ్ పాలసీని అమలులోకి తెచ్చింది. ఇందులోభాగంగా రాజధానిలో 32 జోన్లు ఏర్పాటు చేయగా.. ఒక్కో జోన్‌లో గరిష్టంగా 27 దుకాణాలు తెరవాల్సి ఉంది. ఈ విధంగా మొత్తం 849 దుకాణాలు తెరవాల్సి ఉంది. కొత్త ఎక్సైజ్ పాలసీలో ఢిల్లీలోని అన్ని మద్యం దుకాణాలను ప్రైవేట్‌గా మార్చారు. ఇంతకు ముందు ఢిల్లీలో 60 శాతం మద్యం దుకాణాలు ప్రభుత్వానివి కాగా.. 40 శాతం ప్రైవేట్‌గా ఉండేవి. కొత్త విధానం అమల్లోకి వచ్చిన తర్వాత 100 శాతం ప్రైవేట్‌గా మారింది. దీనివల్ల రూ.3,500 కోట్ల మేర ప్రయోజనం చేకూరుతుందని ప్రభుత్వం వాదించింది.

ప్రభుత్వం కూడా లైసెన్సు ఫీజులను అనేక రెట్లు పెంచింది. ఎల్-1 లైసెన్స్ కోసం గతంలో కాంట్రాక్టర్లు రూ.25 లక్షలు చెల్లించాల్సి ఉండగా.. కొత్త ఎక్సైజ్ పాలసీ అమలులోకి వచ్చిన తర్వాత కాంట్రాక్టర్లు రూ.5 కోట్లు చెల్లించాల్సి వచ్చింది. అదేవిధంగా ఇతర కేటగిరీలలో కూడా లైసెన్స్ ఫీజులు గణనీయంగా పెరిగాయి.

Next Story