పెద్ద నోట్ల రద్దు నిర్ణయం సరైందే: సుప్రీంకోర్టు

Supreme Court affirms Centre’s 2016 decision to demonetise currency notes of Rs 1000, Rs 500. ఢిల్లీ: రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం 2016లో తీసుకున్న నిర్ణయాన్ని

By అంజి  Published on  2 Jan 2023 1:00 PM IST
పెద్ద నోట్ల రద్దు నిర్ణయం సరైందే: సుప్రీంకోర్టు

ఢిల్లీ: రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం 2016లో తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సోమవారం సమర్థించింది. రూ.1000, రూ.500ల కరెన్సీ నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం 2016లో తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టిన జస్టిస్‌ ఎస్‌ఎ నజీర్‌ నేతృత్వంలోని జస్టిస్‌ బిఆర్‌ గవాయి, ఎఎస్‌ బోపన్న, వి. రామసుబ్రమణియన్‌, బివి నాగరత్నలతో కూడిన ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. పెద్ద నోట్ల రద్దును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను కోర్టు కొట్టివేసింది.

4:1 మెజారిటీతో తీర్పును ప్రకటిస్తూ.. కేవలం కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదన వచ్చినందున నిర్ణయ ప్రక్రియను తప్పుపట్టలేమని జస్టిస్ గవాయ్ అన్నారు. నోట్లను రద్దుపై కేంద్రం నిర్ణయం లోపభూయిష్టంగా లేదని, ఈ విషయమై ఆరు నెలల పాటు కేంద్రం, ఆర్‌బీఐ మధ్య సంప్రదింపులు జరిగాయని జస్టిస్ గవాయ్ తెలిపారు. నోట్ల రద్దు నిర్ణయం లక్ష్యాన్ని చేరుకుందా లేదా అనేది సంబంధం లేదని, పెద్ద నోట్లను రద్దు చేస్తూ 2016 నవంబరు 8న కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్‌ చెల్లుబాటు అవుతుందని సుప్రీంకోర్టు పేర్కొంది.

ఐదుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో జస్టిస్‌ బీవీ నాగరత్న మాత్రమే.. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. సెక్షన్ 26(2) ఆర్‌బిఐ చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వ అధికారాల అంశంలో మెజారిటీ తీర్పుతో జస్టిస్ నాగరత్న విభేదించారు. కేంద్రం నిర్ణయంపై ఆమె ప్రశ్నలు లేవనెత్తారు. నోట్ల రద్దును చట్టం ద్వారా చేపట్టాల్సిందని, నోటిఫికేషన్‌ ద్వారా కాదని జస్టిస్‌ నాగరత్న పేర్కొన్నారు. ఆర్‌బీఐ నుంచి కేవలం అభిప్రాయం మాత్రమే తీసుకున్నారని, దీనిని సిఫారసుగా భావించలేమన్నారు. నోట్ల రద్దు అనేది చట్ట విరుద్ధమైన నిర్ణయమని జస్టిస్‌ నాగరత్న తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో 58 పిటిషన్లు దాఖలు అయ్యాయి.

Next Story