లాక్ డౌన్ విధించడంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు..!
supreme court about lockdown. లాక్ డౌన్ ను విధించే అంశాన్ని పరిశీలించాలని సుప్రీంకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది.
By Medi Samrat Published on 3 May 2021 11:56 AM GMTభారతదేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. కొత్తగా 3,68,147 మందికి కరోనా నిర్ధారణ అయిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం తెలిపింది. అదే సమయంలో 3,00,732 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,99,25,604కు చేరింది. గడచిన 24 గంటల సమయంలో 3,417 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 2,18,959కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,62,93,003 మంది కోలుకున్నారు. 34,13,642 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. గతంలో కేసులు వందల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వాలు.. లాక్ డౌన్ ను అమలు చేశాయి. కానీ ఇప్పుడేమో చాలా రాష్ట్రాలు లాక్ డౌన్ వైపు దృష్టి సారించడం లేదు. కొన్ని రాష్ట్రాలు మాత్రమే లాక్ డౌన్ ను అమలు చేస్తూ ఉన్నాయి.
పెరుగుతున్న కరోనా కేసులపై సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేస్తోంది. లాక్ డౌన్ ను విధించే అంశాన్ని పరిశీలించాలని సుప్రీంకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పదలచుకున్నాం. వైరస్ వ్యాపించే అవకాశాలున్న అన్ని రకాల కార్యక్రమాలనూ రద్దు చేయండి. ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని లాక్ డౌన్ విధించే అంశాన్ని పరిశీలించండని సుప్రీం కోర్టు తెలిపింది. లాక్ డౌన్ ను మరోసారి విధించాలని నిర్ణయిస్తే, ప్రభావితం చెందే పేద ప్రజలకు ఆహారాన్ని అందించి, వారి అవసరాలను తీర్చే దిశగా ముందస్తుగానే ప్రణాళికలను రూపొందించాలని సూచించింది. కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యల రికార్డులను అందించాలని తెలిపింది. కరోనా నియంత్రణపై దాఖలైన పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను విచారించిన, జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం, ఏ ఒక్క కరోనా బాధితుడికి కూడా ఆసుపత్రిలో పడక లేదని చెప్పకుండా చూసుకోవాలని, అత్యవసరమైన ఔషధాలను అన్ని ఆసుపత్రులకు అందుబాటులో ఉంచాలని ఆదేశించింది.