మహారాష్ట్రలోని ప్రతిష్టాత్మక బారామతి అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నిక నుంచి కాంగ్రెస్ పార్టీ తప్పుకుంది. దీంతో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం సునేత్రా పవార్ ఈ ఎన్నికల్లో ఏకగ్రీవంగా గెలవనున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో విమాన ప్రమాదంలో మరణించిన సునేత్ర భర్త, మాజీ డిప్యూటీ సీఎం, ఎన్సీపీ నాయకుడు అజిత్ పవార్‌కు గౌరవ సూచకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. బారామతి ఉప ఎన్నిక ఏప్రిల్ 23న జరగాల్సింది. కాంగ్రెస్ తమ అభ్యర్థిని ఉపసంహరించుకోవాలని ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) నేతలు శరద్ పవార్, సుప్రియా సూలేలు కోరడంతో కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుంది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజైన గురువారం నాడు కాంగ్రెస్ అభ్యర్థి అమర్ మోరే పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ హర్షవర్ధన్ తెలిపారు.
బారామతి నియోజకవర్గం పవార్ కుటుంబానికి కంచుకోట లాంటిది. 1991 నుంచి అజిత్ పవార్ ఈ సీటు నుంచి గెలుస్తూ వస్తున్నారు. అంతకుముందు ఆయన బాబాయ్ శరద్ పవార్ ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు. వాస్తవానికి ఒక సైద్ధాంతిక పోరాటం కోసమే తాము సునేత్రపై అభ్యర్థిని నిలబెట్టామని, కానీ గతంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వాల్లో భాగస్వామిగా ఉన్న అజిత్ పవార్ పట్ల గౌరవంతో పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు కాంగ్రెస్ స్పష్టం చేసింది.