వైరల్ అవుతున్న‌ డీప్‌ఫేక్ వీడియో.. సుధామూర్తి స్ట్రాంగ్‌ వార్నింగ్‌..!

రాజ్యసభ ఎంపీ, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ సుధా మూర్తి డీప్‌ఫేక్ వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

By -  Medi Samrat
Published on : 19 Dec 2025 4:47 PM IST

వైరల్ అవుతున్న‌ డీప్‌ఫేక్ వీడియో.. సుధామూర్తి స్ట్రాంగ్‌ వార్నింగ్‌..!

రాజ్యసభ ఎంపీ, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ సుధా మూర్తి డీప్‌ఫేక్ వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పెట్టుబడి అవకాశాల కోసం లింక్‌పై క్లిక్ చేయమని ఆమె ప్రజలను కోరడం ఈ వీడియోలో చూడవచ్చు. అయితే.. వైర‌ల్ అవుతున్న‌ వీడియో జనాలను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ వీడియోపై చాలా మంది స్పందించారు. ఈ వైరల్ వీడియోపై సుధా మూర్తి స్వయంగా స్పందించారు.

సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో.. ఆమె ఒక కార్యక్రమంలో ప్రసంగిస్తున్నట్లు చూడవచ్చు. ఇందులో ఇప్పటికే చాలా మంది ఇన్వెస్టర్లు చేరారని, ప్రతినెలా రూ.10 లక్షలు సంపాదిస్తున్నారని ఆమె చెబుతోంది. ఎక్కువ మంది ఆసక్తి చూపడంతో రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాల్సి వచ్చింది. చేరాలనుకునే వారు ఈ రోజు చివరి వరకు ఈ వీడియో దిగువన ఉన్న‌ లింక్ ద్వారా మాత్రమే నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది అని పేర్కొన‌డం చూడ‌వ‌చ్చు.

ఈ వీడియోపై సుధా మూర్తి స్పందన వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో డీప్‌ఫేక్ అని, అలాంటి వీడియోల పట్ల తాను చాలా ఆందోళన చెందుతున్నానని చెప్పారు. "20 లేదా 30 రెట్లు రాబడిని వాగ్దానం చేసే పెట్టుబడులను ప్రోత్సహించడానికి నా ముఖం, వాయిస్‌ని ఉపయోగించి చేసిన‌ నకిలీ సందేశాల ప‌ట్ల‌ నేను నిజంగా ఆందోళన చెందుతున్నాను" అని ఆమె శుక్రవారం పార్లమెంటు వెలుపల విలేకరులతో అన్నారు. ఇదంతా నకిలీ, AI ద్వారా చేసిన మోసపూరిత చ‌ర్య‌గా పేర్కొన్నారు. పెట్టుబడుల‌ గురించి నేను ఎక్కడా మాట్లాడను అని ఆమె అన్నారు.

మీరు నా ముఖాన్ని చూసినా లేదా పెట్టుబడులను ప్రోత్సహిస్తున్న నా వాయిస్ విన్నా, నమ్మవద్దు. ఇది మీరు కష్టపడి సంపాదించిన డబ్బు, దీన్ని జాగ్రత్తగా ఉపయోగించండని ప్ర‌జ‌ల‌కు సూచించారు.

సుధా మూర్తిని టార్గెట్ చేయడం ఇదే తొలిసారి కాకపోవడం గమనార్హం. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఆమె పెట్టుబడి ప్లాట్‌ఫారమ్ గురించి మాట్లాడుతూ.. మంచి ఫలితాలకు హామీ ఇస్తూ వెంటనే ₹21,000 పెట్టుబడి పెట్టమని ప్రజలను ప్రోత్సహిస్తున్న మరో ఫేక్‌ వీడియో వైరల్ అయింది.

పూణేకు చెందిన 59 ఏళ్ల వ్యక్తి సుధామూర్తి, ఆమె భర్త నారాయణ్ మూర్తి డీప్‌ఫేక్ వీడియోకు బలై 43 లక్షలు పోగొట్టుకున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. తర్వాత ఆ వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ప్రకటన చూశానని, అది రూ. 21,000 ప్రారంభ పెట్టుబడిపై రూ. 17 లక్షలు తిరిగి ఇస్తానని హామీ ఇచ్చిందని చెప్పాడు.

Next Story