బీహార్‌లో 2025 అసెంబ్లీ ఎన్నికలకు ముందు జేడి(యు) అధ్యక్షుడు నితీష్ కుమార్ బీజేపీతో జతకట్టి మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఈ పరిణామాలపై ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. నితీష్ కుమార్‌తో తిరిగి పొత్తు పెట్టుకున్నందుకు బీజేపీ భారీ మూల్యం చెల్లించుకోచవలసి ఉంటుందని ప్రశాంత్ కిషోర్ తెలిపారు. బీహార్‌లో కొత్తగా ఏర్పడిన కూటమి 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల వరకు కొనసాగదని కిషోర్ జోస్యం చెప్పారు.
బీహార్ సీఎం పదవికి ఆదివారం ఉదయం రాజీనామా చేసిన జేడీయూ అధినేత నితీశ్ కుమార్ సాయంత్రం తిరిగి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. బీజేపీ మద్ధతుతో తిరిగి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. గవర్నర్ సమక్షంలో ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. దీంతో బీహార్ ముఖ్యమంత్రిగా 9వ సారి ఆయన సీఎం ప్రమాణం చేశారు. నితిశ్‌తో పాటు జేడీయూ తరపున విజయ్ కుమార్ చౌదరి, బిజేంద్ర ప్రసాద్ యాదవ్, శ్రావణ్ కుమార్ కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేశారు. బీజేపీ తరపున సామ్రాట్ చౌదరి, డాక్టర్ ప్రేమ్ కుమార్, విజయ్ సిన్హా, హిందుస్థానీ అవామ్ మోర్చా (సెక్యులర్) అధ్యక్షుడు డాక్టర్ సంతోష్ కుమార్ సుమన్, స్వతంత్ర ఎమ్మెల్యే సుమిత్ కుమార్ సింగ్ కూడా కేబినెట్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.