Video: 22 రోజుల తర్వాత తిరువనంతపురం ఎయిర్‌పోర్టు నుంచి బ్రిటిష్ ఫైటర్ జెట్ తరలింపు

22 రోజులుగా కేరళలోని తిరువనంతపురం విమానాశ్రయంలో నిలిచిపోయిన బ్రిటిష్ F-35 ఫైటర్ జెట్‌ను ఆదివారం విమానాశ్రయం ఆవరణ నుండి ఎట్టకేలకు తరలించారు.

By Knakam Karthik
Published on : 6 July 2025 8:01 PM IST

National News, Kerala, Thiruvananthapuram Airport,  British Royal Navy, Stealth Technology, UK Military

Video: 22 రోజుల తర్వాత తిరువనంతపురం ఎయిర్‌పోర్టు నుంచి బ్రిటిష్ ఫైటర్ జెట్ తరలింపు

గత నెలలో అత్యవసరంగా ల్యాండింగ్ అయినప్పటి నుండి 22 రోజులుగా కేరళలోని తిరువనంతపురం విమానాశ్రయంలో నిలిచిపోయిన బ్రిటిష్ F-35 ఫైటర్ జెట్‌ను ఆదివారం విమానాశ్రయం ఆవరణ నుండి ఎట్టకేలకు తరలించారు. బ్రిటిష్ రాయల్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్‌బస్ A400M అట్లాస్‌లోని సాంకేతిక నిపుణుల బృందం F -35 జెట్‌ను అంచనా వేయడానికి ఈరోజు తిరువనంతపురం విమానాశ్రయానికి చేరుకుంది. ఎగిరేందుకు మొండికేసిన ఈ విమానాన్ని ఓ టోయింగ్ వాహనానికి కట్టి లాక్కెళ్లారు. ఇటీవల సాంకేతిక లోపం తలెత్తడంతో ఈ యుద్ధ విమానం ఇక్కడే ఆగిపోయింది. అప్పటి నుంచి బ్రిటిష్ టెక్నీషియన్లు దీనికి మరమ్మతులు చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు.

తాజాగా బ్రిటన్ నుంచి ఎయిర్‌బస్ ఏ400ఎం అట్లాస్ విమానంలో మరో ఇంజనీర్ల బృందం ఇక్కడికి చేరుకుంది. ఈ విమానాన్ని ఇక్కడే బాగుచేయడం సాధ్యమవుతుందా లేక విడిభాగాలుగా విడదీసి సి-17 గ్లోబ్‌మాస్టర్ సైనిక రవాణా విమానంలో స్వదేశానికి తీసుకెళ్లాలా అనే అంశాన్ని ఈ బృందం తేల్చనుంది. సుమారు 110 మిలియన్ డాలర్లకు పైగా విలువైన ఈ జెట్‌లో శత్రువుల రాడార్లకు చిక్కని అత్యంత రహస్యమైన స్టెల్త్ టెక్నాలజీ ఉంది. ఒకవేళ విమానాన్ని విడదీయాల్సి వస్తే, బ్రిటిష్ సైన్యం అత్యంత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టనుంది. రహస్య సాంకేతికత చోరీకి గురికాకుండా ఉండేందుకు ప్రతి స్క్రూకు కూడా సెక్యూరిటీ కోడ్ కేటాయించి, ప్రతి కదలికను నమోదు చేస్తారు. ఈ టెక్నాలజీ బయటకు పొక్కితే సైనిక రహస్యాలు బహిర్గతమై తీవ్ర దౌత్య, సైనిక పరిణామాలకు దారితీసే ప్రమాదం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఇలా ఒక ఎఫ్-35 విమానాన్ని విడిభాగాలుగా విడదీసి రవాణా చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో 2019లోనూ అమెరికాలో ఒక విమానాన్ని ఇలాగే సి-17 విమానంలో తరలించారు.

Next Story