భారత్ కు చేరిన పురాతన అన్నపూర్ణ విగ్రహం

Stolen idol of Goddess Annapurna to return to Varanasi from Canada. కాశీ నుంచి దాదాపు వంద సంవత్సరాల క్రితం చోరీకి గురై అన్నపూర్ణ విగ్రహం భారత్ కు చేరుకుంది. 18వ శతాబ్దానికి చెందిన

By అంజి  Published on  11 Nov 2021 4:00 PM IST
భారత్ కు చేరిన పురాతన అన్నపూర్ణ విగ్రహం

కాశీ నుంచి దాదాపు వంద సంవత్సరాల క్రితం చోరీకి గురై అన్నపూర్ణ విగ్రహం భారత్ కు చేరుకుంది. 18వ శతాబ్దానికి చెందిన ఈ విగ్రహం కెనడా చేరింది. ఈ విషయాన్ని గుర్తించిన భారత ప్రభుత్వం దాన్ని తీసుకుని వచ్చింది. ఈ విగ్రహాన్ని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి అప్పగించారు. ఈ విగ్రహానికి అన్నపూర్ణ దేవి యాత్ర పేరుతో నాలుగు రోజుల పాటు శోభాయాత్రను నిర్వహించనున్నారు. ఈ నెల 15న కాశీ విశ్వేశ్వర ఆలయంలో విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.

నాలుగు రోజుల యాత్ర సంద‌ర్భంగా అన్న‌పూర్ణ విగ్ర‌హాన్ని మొదట ఢిల్లీ నుంచి అలీఘ‌డ్‌కు తీసుకువెళ్ల‌నున్నారు. అక్క‌డ నుంచి 12వ తేదీన క‌న్నౌజ్‌కు త‌ర‌లిస్తారు. ఆ త‌ర్వాత 14వ తేదీన అయోధ్య‌కు తీసుకువెళ్తారు. 15వ తేదీన కాశీ విశ్వ‌నాథ ఆల‌యంలో ఆ విగ్ర‌హాన్ని ప్ర‌తిష్టిస్తారు. కెనడా ప్రభుత్వంతో అనేక సంవత్సరాలు చర్చలు జరిపి విగ్రహాన్ని వెనక్కి తీసుకొచ్చామని.. కొన్ని రోజుల్లో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ ప్రభుత్వాలకు కూడా విదేశాల్లో ఉన్న విగ్రహాలను అందిస్తామని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు. భారతదేశానికి సంబంధించిన ఎన్నో పురాతన విగ్రహాలు తిరిగి భారత్ కు తెప్పించే ప్రయత్నాలు ప్రభుత్వం చేస్తూ ఉంది. 100 ఏళ్ల క్రితం కాశీ నుంచి చోరీకి గురైన అన్నపూర్ణ దేవి విగ్రహాన్ని ఎట్టకేలకు దాని స్వస్థలమైన వారణాసికి తిరిగి ఇస్తున్నట్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇటీవలే తెలిపారు.

Next Story