దేశంలో కరోనా రోజురోజుకు విజృంభిస్తోంది. కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ మహమ్మారి బారినపడి ఇప్పటికే ఎంతో మంది ప్రముఖులు ప్రాణాలు వదిలారు. తాజాగా తమిళనాడు రాష్ట్రంలోని శ్రీవిల్లిపుత్తూరు నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి మాధవరావు ఈ మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఆయన వయస్సు 63 సంవత్సరాలు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేశారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సమయంలో ఆయనకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో పాజిటివ్‌గా తేలింది. దీంతో గత నెల 20న మదురైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు.
మాధవరావుకు మద్దతుగా ఆయన తనయ ప్రచారం నిర్వహించింది. ఇదిలా ఉంటే.. ఆయన ఊపిరితిత్తులు దెబ్బతినడంతో పరిస్థితి విషమించి ఈ రోజు ఉదయం కన్నుమూశారు. ఆయన మృతిపై ఏఐసీసీ కార్యదర్శి సంజయ్ విచారం వ్యక్తం చేశారు. 'కాంగ్రెస్ నాయకుడు, శ్రీవిల్లిపుత్తూరు పార్టీ అభ్యర్థి మాధవరావు మృతి చెందడం బాధాకరం. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా.' అని సంజయ్ దత్ ట్వీట్ చేశారు.
వ్యాపారవేత్త, లీగల్ కన్సల్టెంట్ కూడా అయిన మాధవరావు కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశారు. తమిళనాడు పీసీసీలో క్రియాశీల సభ్యుడిగా ఉన్నారు. నామినేషన్ దాఖలు చేసిన వెంటనే అనారోగ్యానికి గురైన ఆయన ప్రచారాన్ని కూడా నిలిపివేశారు. 234 అసెంబ్లీ స్థానాలున్న తమిళనాడులో ఈనెల 6న ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో శ్రీవిల్లిపుత్తూరులో 73.03 పోలింగ్ శాతం నమోదైంది. మే 2న ఫలితాలు వెల్లడికానున్నాయి. ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం శ్రీవిల్లిపుత్తూరులో ఒకవేళ ఆయన విజయం సాధిస్తే.. ఉపఎన్నిక నిర్వహించే అవకాశం ఉంది.