స్పైస్ జెట్ విమానానికి తప్పిన ప్రమాదం, కోల్‌కతాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్

ముంబై నుండి కోల్‌కతాకు వెళ్తున్న స్పైస్‌జెట్ విమానం SG670 ఆదివారం రాత్రి అత్యవసరంగా ల్యాండ్ అయింది

By -  Knakam Karthik
Published on : 10 Nov 2025 1:05 PM IST

National News, SpiceJet, SpiceJet emergency landing, Kolkata airport, Subhash Chandra Bose International Airport

స్పైస్ జెట్ విమానానికి తప్పిన ప్రమాదం, కోల్‌కతాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్

ముంబై నుండి కోల్‌కతాకు వెళ్తున్న స్పైస్‌జెట్ విమానం SG670 ఆదివారం రాత్రి అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమానం ఇంజిన్లలో ఒకదానిలో వైఫల్యం సంభవించిందని కోల్‌కతా విమానాశ్రయ అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ప్రయాణికులు, సిబ్బంది అంతా సురక్షితంగా బయటపడటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

విమానాశ్రయ అధికారుల కథనం ప్రకారం, స్పైస్‌జెట్‌కు చెందిన ఎస్‌జీ 670 విమానం ఆదివారం రాత్రి ముంబై నుంచి కోల్‌కతాకు బయలుదేరింది. కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్ కోసం కిందకు దిగుతున్న సమయంలో, విమానంలోని ఒక ఇంజిన్ విఫలమైనట్లు పైలట్లు గుర్తించారు. వెంటనే వారు అప్రమత్తమై ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)కు సమాచారం అందించారు.

పైలట్ల నుంచి సమాచారం అందగానే విమానాశ్రయ అధికారులు వెంటనే ఫుల్ ఎమర్జెన్సీ ప్రకటించారు. అగ్నిమాపక, సహాయక బృందాలను రన్‌వే వద్ద సిద్ధంగా ఉంచారు. రాత్రి 11:38 గంటలకు విమానం సురక్షితంగా ల్యాండ్ అయిన తర్వాత ఫుల్ ఎమర్జెన్సీని ఉపసంహరించుకున్నట్లు ఓ అధికారి తెలిపారని ఏఎన్ఐ వార్తా సంస్థ పేర్కొంది. ప్రయాణికులందరినీ సురక్షితంగా విమానం నుంచి కిందకు దించారు.

ఈ ఘటనపై స్పైస్‌జెట్ సంస్థ ఈ ఉదయం ఒక ప్రకటన విడుదల చేసింది. కోల్‌కతాలో ల్యాండింగ్ సమయంలో తమ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తిన మాట వాస్తవమేనని, అయితే విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందని తెలిపింది. "ప్రయాణికులు, సిబ్బంది అందరూ సాధారణంగానే విమానం నుంచి కిందకు దిగారు" అని స్పైస్‌జెట్ ప్రతినిధి వివరించారు. ప్రస్తుతం విమానాన్ని ఇంజినీరింగ్ బృందాలు క్షుణ్ణంగా పరీక్షిస్తున్నాయని సంస్థ పేర్కొంది.

Next Story