దేవుడికి నైవేద్యంగా సిగరెట్లు.. ఇలా చేస్తే కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం

గుజరాత్‌ రాష్ట్రంలోని సూరత్‌లో ఓ ప్రత్యేకమైన ఆలయం ఉంది. ఇక్కడ దేవుడికి భక్తులు సిగరెట్లు సమర్పిస్తుంటారు.

By అంజి  Published on  7 March 2023 11:42 AM IST
Gujarat,special temple, cigarette

సూరత్‌లోని వంజారా భూత్‌మామ ఆలయం

గుజరాత్‌ రాష్ట్రంలోని సూరత్‌లో ఓ ప్రత్యేకమైన ఆలయం ఉంది. ఇక్కడ దేవుడికి భక్తులు తమ కోరికలు నెరవేరాలని బంగారం, వెండి వస్తువులకు బదులుగా సిగరెట్లు సమర్పిస్తుంటారు. అథ్వాలిన్స్‌ ప్రాంతంలోని ఆదర్శ్‌ సొసైటీలో వంజారా భూత్‌మామ అనే చిన్న ఆలయం ఉంది. ఈ ఆలయం చిన్నదే అయినా.. ఇక్కడి దేవుడిపై భక్తుల నమ్మకం చాలా పెద్దది. ఈ ప్రాంతంలో 130 ఏళ్ల క్రితం కరువు ఏర్పడింది. అప్పట్లో ఇక్కడ వంజారులు అనే సమూహం ఇక్కడ నివసించేది. ఆ సమయంలో ఒక వంజర మరణించాడు. ఆ తర్వాత అతని సమాధిని అక్కడ నిర్మించారు.

అదే ప్రస్తుతం వంజారా భూత్‌మామ ఆలయంగా ఏర్పాటైంది. అప్పటి నుంచి ఈ ప్రదేశాన్ని వంజర భూత్‌మామ అని పిలుస్తారు. 130 ఏళ్ల నాటి ఓ చెట్టు సైతం ఆలయం సమీపంలో ఉంది. సిగరెట్లు వెలిగించి దైవాన్ని కొలవడం ద్వారా కోరిన కోరికలు తీరుతాయని ఇక్కడి భక్తుల నమ్మకం. సిగరెట్లతో పాటు మగాస్ అనే మిఠాయిలు కూడా భూత్‌మామ దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తుంటారు. మాగాస్‌ స్వీట్లను సమర్పిస్తే పనిలో ఏకాగ్రత ఉంటుందని నమ్ముతారు. మాగాస్‌ స్వీట్‌ ప్రత్యేక సందర్భాలలో మాత్రమే తింటారు. ఈ స్వీట్‌ని శెనగపిండి, డ్రై ఫ్రూట్స్, చక్కెరతో చేస్తారు.

ఆలయ సంరక్షకుడు అశోక్‌భాయ్ ఆచారాన్ని వివరిస్తూ.. ''భక్తులు సిగరెట్ వెలిగించిన తరువాత, భక్తులు దానిని మూడుసార్లు భూత్‌మామ నోటి దగ్గర ఉంచుతారని, ఆపై వెలిగించిన సిగరెట్లను ఆలయం లోపల ఉంచడం లేదని ఆవరణను శుభ్రంగా ఉంచుతామని చెప్పారు. "మేము దీనిని భూత్‌మామ దేవాలయం అని కూడా పిలుస్తాము. ఇంతకుముందు మా తాతగారు భూత్‌ మామకి 'బీడీలు' ఇచ్చేవారు, కానీ ఇప్పుడు మేము సిగరెట్లను అందిస్తున్నాం. భక్తులు తమ కోరికలు నెరవేరినప్పుడల్లా ఇక్కడ సిగరెట్ కాల్చుతారు'' అని చెప్పారు.

దేవుడి ఆశీర్వాదంతో ఈ ప్రాంతం ప్రశాంతంగా ఉందని పేర్కొంటూ.. ప్రతి సంవత్సరం 15,000 మందికి పైగా హాజరయ్యే 'భండారా' (భక్తులకు భోజనం పెట్టే కార్యక్రమం) నిర్వహిస్తామని అశోక్‌భాయ్ చెప్పారు. ''మేము గత 14 నుండి 15 సంవత్సరాలుగా భూత్‌మామ పుట్టినరోజును జరుపుకుంటున్నాము. ముంబై, ఉత్తర గుజరాత్, సౌరాష్ట్ర ప్రజలు పెద్ద సంఖ్యలో దీనికి హాజరవుతారు'' అని చెప్పారు.

Next Story