రైళ్ల ప్రత్యేక నంబర్లను తీసివేసి.. పాత నంబర్లతో రైళ్లు నడపాలని సౌత్ సెంట్రల్ రైల్వే ఆదేశాలు జారీ చేసింది. శనివారం నాడు ఆదేశాలు జారీ చేసిన సాంకేతిక కారణాల వల్ల ఈ ప్రక్రియ ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పటికి కూడా రైళ్ల నంబర్లు మారలేదు. రిజర్వేషన్ ప్రక్రియలో సున్నాతో ప్రత్యేక రైళ్లు ఉన్నట్లుగానే కనిపిస్తోంది. అయితే అన్ని రిజర్వుడు రైళ్ల నంబర్లను అప్‌లోడ్ చేస్తున్నామని, దీనికి ఒక క్రమ పద్ధతిలో పాత నంబర్లు, ప్రస్తుత ప్యాసింజర్ బుకింగ్ డేటాను అప్‌డట్ చేయాల్సి ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
దీని కోసం ఈ నెల 20వ తేదీ వరకు రాత్రి సమయం 11.30 నుండి ఉదయం 5.30 గంటల వరకు టికెట్ల రిజర్వేషన్, కరెంటు బుకింగ్, టికెట్ల రద్దు సేవలు అందుబాటులో ఉండవని తెలిపింది. ప్రయాణికులుందరూ సహకరించాలని దక్షిణ మధ్య రైల్వే కోరింది. 139 టెలిఫోన్ సేవలతో పాటు మిగతా అన్ని సేవలు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. రైలు నంబర్లు మార్చిన తర్వాత ప్రయాణికులకు ఎస్‌ఎంఎస్ ద్వారా తెలుపుతామని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది.
కరోనా కారణంగా ప్రయాణికుల రద్దీని నియంత్రించడానికి, అనవసరపు జర్నీలను తగ్గించేందుకు రైలు చార్జీలను పెంచారు. అయితే ప్రస్తుతం కోవిడ్ ప్రభావం తగ్గుముఖం పట్టుతుండడంతో రైలు సర్వీసులను పునరుద్ధరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొవిడ్ ముందు తీసుకున్న రైలు చార్జీలను మళ్లీ ఇప్పుడు తీసుకుంటామంటూ ఇటీవల రైల్వే బోర్డు ప్రకటించింది. ఇది అన్ని రకాల రైలులు, క్లాసులకు వర్తిస్తుందని వెల్లడించింది.