దక్షిణాఫ్రికాలో కొత్త రకం కరోనా వైరస్ను గుర్తించామని ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి జ్వేలి మఖాయిజ్ పేర్కొన్న విషయం తెలిసిందే. ఇది వేగంగా వ్యాప్తి చెందుతోందని, దేశంలో రెండో విడత మహమ్మారి విజృంభణను ఇది తీవ్రం చేస్తోందని తెలిపారు. ఆరోగ్యపరంగా ఎలాంటి రుగ్మతలు లేనివారిపైన, యువతపైన కూడా కరోనా వైరస్ ఇటీవల ప్రభావం చూపుతోందని వైద్యులు తెలిపారు. ఈ కొత్త రకం వైరస్పై అప్రమత్తంగా ఉండాలని, అయితే ఆందోళన చెందవద్దని ప్రజలకు సూచించారు.
తాజాగా కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా కేంద్రంలో దక్షిణాఫ్రికా కరోనా స్ట్రెయిన్ కేసు బయటపడింది. కొన్నిరోజుల కిందట దుబాయ్ నుంచి బెంగళూరులో దిగి అక్కడి నుంచి శివమొగ్గకు వెళ్లిన వ్యక్తి (53)కు కొత్త కరోనా సోకినట్లు నిర్ధారించారు. అక్కడే ఓ వారం రోజులు క్వారంటైన్ లో ఉండి బయటకు వచ్చాడు. అనుమానంతో మరోసారి కోవిడ్ పరీక్ష చేయించుకోగా పాజిటివ్ అని వెల్లడైంది.
కొత్త రకం కరోనా అని పరీక్షించగా దక్షిణాఫ్రికాలో ఇటీవల గుర్తించిన స్ట్రెయిన్‌గా తేలింది. దాంతో ఆయనకు ప్రత్యేకంగా వైద్యం అందిస్తున్నారు. ఇదిలా ఉంటే.. భారత్‌లో గడిచిన 24 గంటల్లో 23,285 కరోనా పాజిటివ్ కేసులు, 117 మరణాలు నమోదయ్యాయి. దేశ వ్యాప్తంగా నమోదైన మొత్తం కోవివ్ కేసుల సంఖ్య 1,13,08,846కు చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం వెల్లడించింది.