రాజ్యసభకు సోనియా గాంధీ..! రంగంలోకి ప్రియాంక గాంధీ..!
లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఈనేపథ్యంలో జాతీయ పార్టీలన్నీ ఎన్నికలకు సిద్దం అవుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 12 Feb 2024 4:00 PM GMTరాజ్యసభకు సోనియా గాంధీ..! రంగంలోకి ప్రియాంక గాంధీ..!
లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఈనేపథ్యంలో జాతీయ పార్టీలన్నీ ఎన్నికలకు సిద్దం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్‌లో పలు కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ రాజ్యసభకు నామినేట్ కాబోతున్నట్లు సమాచారం. లోక్‌సభ ఎన్నికల నుంచి ఆమె వైదొలిగి.. కుమార్తె ప్రియాంక గాంధీని రంగంలోకి దించే చాన్స్ ఉందని చర్చ జరుగుతోంది.
కాగా.. తెలంగాణ సహా పలు రాష్ట్రాల నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహించాలనిసోనియాను ఆయా రాష్ట్రాల నాయకులు కోరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సోనియా రాజస్థాన్ నుంచి నామినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. మరోవైపు సోనియాగాంధీ 2006 నుంచి ప్రాతినిథ్యం వహిస్తోన్న రాయ్ బరేలీ నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే తొలిసారి ప్రియాంక గాంధీ ఎన్నికల బరిలో నిలిచే స్థానం ఇదే అవుతుంది. కాగా.. రాయ్‌బరేలి కాంగ్రెస్‌కు మంచి పట్టు ఉన్న స్థానం. మోదీ ప్రభంజనంతో 2019 ఎన్నికల్లో రాహుల్ ఓడినా.. కాంగ్రెస్‌కు ప్రతికూల వాతావరణం ఉన్నా కూడా రాయ్‌బరేలీలో మాత్రం గెలిచింది. ఈ క్రమంలో ప్రియాంక అక్కడి నుంచి పోటీ చేస్తే గెలుపు ఖాయమని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
కాగా.. సోనియా గాంధీ రాజ్యసభకు నామినేట్ కాబోతున్నారనే అంశంపై ఇప్పటివరకు ఊహాగానాలే తప్ప ఎలాంటి అధికారిక సమాచారం లేదు. రాయ్ బరేలి నుంచి ప్రియాంక గాంధీ పోటీలో ఉంటే ఉత్తరాదిలోని కీలక రాష్ట్రంలో విపక్ష కూటమికి అనుకూల వాతావరణం నెలకొనే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి.