ప్రధాని నరేంద్ర మోదీకి సోనియా గాంధీ లేఖ

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల అజెండాపై స్పష్టత ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీకి సోనియా గాంధీ లేఖ రాశారు.

By Srikanth Gundamalla  Published on  6 Sept 2023 1:50 PM IST
Sonia gandhi, Letter, PM Modi, parliament session,

 ప్రధాని నరేంద్ర మోదీకి సోనియా గాంధీ లేఖ

పార్లమెంట్‌ సమావేశాలు జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే.. సమావేశాలు జరిపేముందు ప్రతిపక్షాలతో ప్రభుత్వం చర్చలు జరపాలి. ఇది ఆనవాయితీగానే వస్తుంది. కానీ ఈసారి ఎలాంటి చర్చలు జరపలేదని.. స్పష్టంగా చెప్పకుండానే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు పిలుపునిచ్చారని సోనియాగాంధీ విమర్శించారు. ప్రత్యేక సమావేశాల అజెండా ఏంటనేది కూడా వెల్లడించలేదన్నారు సోనియా. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల అజెండాపై స్పష్టత ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీకి సోనియా గాంధీ లేఖ రాశారు.

ప్రతిపక్షాలతో ఎలాంటి చర్చలు జరపకుండా సమావేశాలకు పిలుపునివ్వడం ఇదే మొదటిసారి అని సోనియాగాంధీ లేఖలో పేర్కొన్నారు. అయితే.. పార్లమెంట్‌ సమావేశాల్లో చర్చించబోయే విషయాలపై తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని అన్నారు. ఎందుకోసం ఈసారి సెషన్‌కు పిలుపునిచ్చారనే విషయంపై స్పష్టమైన ప్రకటన ఇవ్వాలని కోరారు సోనియా గాంధీ. మరి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. మరోవైపు విపక్ష కూటమి ఇండియా ప్రత్యేక సమావేశాల నిర్వహణపై కేంద్రం నుంచి స్పష్టత కోరింది.

సోనియాగాంధీ తన లేఖలో పార్లమెంట్‌లో చర్చించాల్సిన అంశాలపై లేఖలో ప్రస్తావించారు. అదానీ అక్రమాలు, మణిపుర్‌ అల్లర్లు, రైతు సమస్యలు, కనీస మద్దతు ధర విషయంలో ఇచ్చిన హామీ, కులాల వారీగా జనగణన, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రోజురోజుకీ దిగజారుతున్న సంబంధాలు, ప్రకృతి వైపరీత్యాల నుంచి ప్రజలను ఆదుకోవడం, హరియాణా సహా దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో చెలరేగుతున్న మత ఘర్షణలు, సరిహద్దుల్లో కొనసాగుతున్న చైనా ఆక్రమణలపై చర్చ చేపట్టాలని సోనియా గాంధీ లేఖలో కోరారు.

సెప్టెంబర్ 18 నుంచి 22వ తేదీ వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఐదు రోజుల పాటు పార్లమెంట్ కొత్త భవనంలో ఈ సమావేశాలు జరగనున్నాయి. అయితే.. స్పష్టమైన అజెండా ప్రకటన చేస్తామని పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. కానీ.. ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాల్లో జమిలి ఎన్నికలు, కొత్త చట్టాల రూపకల్పన, దేశం పేరు మార్పు తీర్మానంపై చర్చించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.

Next Story