రాజీవ్‌గాంధీ గురించి సోనియా భావోద్వేగ వ్యాఖ్యలు
రాజీవ్‌గాంధీ జీవితం చాలా దారుణంగా ముగిసిందని భావోద్వేగ కామెంట్స్ చేశారు సోనియాగాంధీ.
By Srikanth Gundamalla Published on 21 Aug 2023 6:58 AM GMTరాజీవ్‌గాంధీ గురించి సోనియా భావోద్వేగ వ్యాఖ్యలు
రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఆదివారం 25వ రాజీవ్‌గాంధీ నేషనల్ సద్భావన అవార్డు కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియాగాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తన భర్త, మాజీ ప్రధాని దివంగత రాజీవ్‌గాంధీ గురించి భావోద్వేగ కామెంట్స్ చేశారు. రాజీవ్‌గాంధీ జీవితం చాలా దారుణంగా ముగిసిందని ఆవేదన చెందారు. ఆయన పాలన కొంతకాలమే సాగిందనీ.. కానీ లెక్కలేనన్ని విజయాలను సాధించారని రాజీవ్‌గాంధీ సేవలను కొనియాడారు సోనియా.
రాజీవ్‌గాంధీ మహిళా సాధికారకత కోసం ఎంతో కృషి చేశారని చెప్పుకొచ్చారు. పంచాయతీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు పోరాడారంటూ గుర్తు చేశారు సోనియాగాంధీ. ప్రస్తుతం స్థానిక సంస్థల్లో పెద్ద ఎత్తున మహిళలు ఉన్నారంటే దానికి కారణం రాజీవ్‌గాంధే అని.. ఆయన చలువేనని ప్రశంసించారు. ఓటు హక్కు వయసును కూడా 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించింది రాజీవ్ గాంధీని అని సోనియా అన్నారు. దేశానికి రాజీవ్‌గాంధీ ఎనలేని సేవలు అందించారని ఈ సందర్భంగా సోనియాగాంధీ చెప్పారు. అయితే రాజీవ్‌గాంధీ రాజకీయ జీవితం అత్యంత క్రూరంగా ముగిసిందని చెబుతూ భావోద్వేగానికి లోనయ్యారు సోనియా గాంధీ. 40 ఏళ్ల వయసులో ప్రధాన మంత్రి గా బాధ్యతలు స్వీకరించిన ఆయన 1989 డిసెంబర్ 2 వరకు ఆ పదవిలో కొనసాగారు. ఎల్టీటీఈ ఆత్మాహుతి దాడిలో 1991, మే 21న రాజీవ్‌గాంధీ మృతి చెందారు.
ఆ తర్వాత ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంపైన సోనియాగాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన, ద్వేషం, మతోన్మాదం, పక్షపాత రాజకీయాలను ప్రోత్సహించే శక్తులు ప్రస్తుతం అధికారంలో ఉన్నాయని విమర్శించారు. శాంతి, మతసామరస్యం, జాతీయ సమైక్యత పెంపునకు కృషి చేసే వ్యక్తులు, సంస్థలకు రాజీవ్‌గాంధీ నేషనల్ సద్భావన అవార్డు అందజేస్తున్నట్లు తెలిపారు సోనియా. ద్వేషపూరిత రాజకీయాలను ప్రోత్సహించేవారు చురుగ్గా ఉన్నప్పడు ఇలాంటి అంశాల మరింత ముఖ్యమైనవి అని సోనియాగాంధీ తెలిపారు.