పాముల్లోని విషాన్ని సేకరించి అక్రమంగా స్మగ్లింగ్ చేస్తున్న ఓ ముఠా పట్టుబడింది. 200కు పైగా కోబ్రాల నుంచి సేకరించిన లీటర్ విషాన్ని తరలిస్తుండగా భువనేశ్వర్ ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు. దీని విలువ దాదాపు కోటి రూపాయల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. జిల్లా అటవీ అధికారి అశోక్ మిశ్రా తెలిపిన వివరాల మేరకు.. మేము ఒక లీటర్ పాము విషాన్ని స్మగ్లింగ్ చేస్తుండగా పట్టుకున్నాం. ఐదు మిల్లీ లీటర్ల చిన్న చిన్న బాటిల్స్‌లో నింపి ఈ విషాన్ని స్మగ్లింగ్ చేస్తున్నారు. ముగ్గురు పురుషులు, ఓ మహిళ కలిసి విషాన్ని సేకరించి కొనుగోలు దారులతో రూ.10లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు.
దీనిపై సమాచారం అందడంతో దాడి చేసి ఈ ముఠాను అదుపులోకి తీసుకుని విషాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. బహిరంగ మార్కెట్ లో ఈ విషం విలువు కోటి రూపాయల వరకు ఉంటుందని చెప్పారు. ఒక లీటర్ విషాన్ని సేకరించాలంటే 200 కోబ్రాలు అవసరమవుతాయన్నారు. కాగా.. ఈ కేసుతో సంబంధమున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నామని ఆయన వెల్లడించారు. వీరిని కోర్టులో హాజరు పరుస్తామని చెప్పారు. పాము విషానికి ముఖ్యంగా విదేశాల్లో డిమాండ్ ఎక్కువగా ఉంది. కొన్ని రకాల మందుల్లోనూ దీన్ని వినియోగీస్తారు.