హర్యానా అసెంబ్లీ ఎన్నికల బరిలో వినేష్ ఫోగట్.. అదే బాటలో మరికొంత మంది క్రీడాకారులు
క్రీడా రంగంలో తమ ప్రత్యర్థులను ఓడించిన హర్యానాకు చెందిన ఆరుగురికి పైగా క్రీడాకారులు ఈసారి అసెంబ్లీ ఎన్నికల రాజకీయ పిచ్‌పై తమ సత్తాను చాటేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి
By Medi Samrat Published on 21 Aug 2024 9:48 AM GMTక్రీడా రంగంలో తమ ప్రత్యర్థులను ఓడించిన హర్యానాకు చెందిన ఆరుగురికి పైగా క్రీడాకారులు ఈసారి అసెంబ్లీ ఎన్నికల రాజకీయ పిచ్‌పై తమ సత్తాను చాటేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒలింపియన్లు జరంగ్ పునియా, వినేష్ ఫోగట్, రెజ్లర్ సాక్షి మాలిక్‌లపై కాంగ్రెస్ కన్నేసింది. ఎంపీ దీపేంద్ర హుడా స్వయంగా ఇద్దరు ఆటగాళ్లతో చాలా కాలంగా టచ్‌లో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. బజరంగ్ పునియా ఝజ్జర్‌కు చెందినవాడు. వినేష్ ఫోగట్ బధ్రా ప్రాంత నివాసి. అయితే ఇద్దరు ఆటగాళ్లు ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తుంది. అదే సమయంలో.. గత ఎన్నికల్లో బీజేపీ టికెట్‌పై ముగ్గురు ఒలింపియన్లు బరిలోకి దిగారు. వారు మళ్లీ టికెట్ కోసం కసరత్తు చేస్తున్నారు.
ఒలింపియన్ యోగేశ్వర్ దత్ 2019 ఎన్నికల్లో బరోడా నుంచి బీజేపీ టికెట్‌పై పోటీ చేశారు. ఆ తర్వాత ఉపఎన్నికల్లో కూడా బీజేపీ నుంచి పోటీ చేసిన ఆయన.. రెండుసార్లు ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. అదేవిధంగా ఒలింపియన్, క్రీడాకారిణి బబితా ఫోగట్ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో చర్కీ దాద్రీ నుండి బిజెపి టిక్కెట్‌పై పోటీ చేసింది. అయితే స్వతంత్ర అభ్యర్థి సోంబిర్ సాంగ్వాన్ చేతిలో ఆమె ఓడిపోయారు. మాజీ హాకీ కెప్టెన్ సందీప్ సింగ్ బీజేపీ టిక్కెట్‌పై పెహోవా నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన మనోహర్ లాల్ ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. ఈ ముగ్గురు ఆటగాళ్లు మళ్లీ వారి వారి సర్కిల్‌లలో చురుకుగా ఉన్నారు. టిక్కెట్ కోసం తమ వాదనను బలంగా వినిపిస్తున్నారు. అయితే.. మాజీ క్రీడా మంత్రి సందీప్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన జూనియర్ మహిళా కోచ్ పెహోవా అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ నుంచి టికెట్ కోరింది. అసెంబ్లీ ఎన్నికల్లో సందీప్ సింగ్‌పై పోటీ చేసేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారు.
బాక్సింగ్ ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేసిన విజేందర్ సింగ్ ఇప్పుడు బీజేపీలో చేరారు. 2019లో దక్షిణ ఢిల్లీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. 2019లోనే ఆయన కాంగ్రెస్‌లో చేరారు. విజేందర్ సింగ్ హర్యానా, పశ్చిమ ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్‌లలో పెద్ద మొత్తంలో రాజకీయ ప్రభావాన్ని కలిగి ఉన్న జాట్ కమ్యూనిటీ నుండి వచ్చారు. అయితే.. 2024 ఏప్రిల్‌లో లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరాడు.
రాజకీయవేత్తగా మారిన క్రికెటర్ చేతన్ శర్మ 2009 లోక్‌సభ ఎన్నికల్లో ఫరీదాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బహుజన్ సమాజ్ పార్టీ తరపున పోటీ చేశారు. చేతన్ శర్మ బ్రాహ్మణ కమ్యూనిటీకి చెందినవాడు. చేతన్ శర్మ 1,13,453 మెజార్టీతో విజయం సాధించారు. అయితే ఆ తర్వాత ఆయన బీజేపీలో చేరి స్పోర్ట్స్ సెల్ కన్వీనర్‌గా ఉన్నారు. ఆయన కూడా మరోమారు ఎన్నికల బరిలో ఉంటారనే ఊహాగానాలు వెలువడుతున్నాయి.