ఆరు రోజులు లాక్ డౌన్ ప్రకటిస్తూ సీఎం సంచలన నిర్ణయం
Six-day complete lockdown in Delhi from tonight. ఢిల్లీ ఆరు రోజుల పాటు లాక్‌డౌన్ విధిస్తున్నట్టు అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు.
By Medi Samrat
దేశంలో కరోనా కేసులు అత్యధికంగా పెరిగిపోతున్న రాష్ట్రాల్లో ఢిల్లీ కూడా ఒకటి. దీంతో కరోనాను కట్టడి చేయడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చాలా నిర్ణయాలు తీసుకుంది. ఏప్రిల్ 16 రాత్రి 10 గంటల నుండి ఏప్రిల్ 19 ఉదయం 6 గంటల వరకు జాతీయ రాజధానిలో వారాంతపు కర్ఫ్యూను ప్రకటించారు. ఏప్రిల్ 30 వరకు మాల్స్, వ్యాయామశాలలు, ఆడిటోరియంలను మూసివేస్తున్నట్టు ఆప్ సర్కార్ ప్రకటించింది. అయినప్పటికీ గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో రికార్డు స్థాయిలో 25,462 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. 161 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో లాక్ డౌన్ ను ప్రకటిస్తున్నట్లు తెలిపారు.
ఆరు రోజుల పాటు లాక్‌డౌన్ విధిస్తున్నట్టు అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. సోమవారం రాత్రి నుంచే లాక్‌డౌన్ అమల్లోకి రానుందని.. ఏప్రిల్ 26 ఉదయం వరకు లాక్‌డౌన్ కొనసాగనుతుందని కేజ్రీవాల్ ప్రకటన చేశారు. ఢిల్లీలో పరిస్థితుల దృష్ట్యా లాక్‌డౌన్ తప్పనిసరని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. టెస్టుల సామర్థ్యాన్ని పెంచామని, ఇప్పటికే ఐసోలేషన్ బెడ్‌లు పూర్తిగా నిండిపోయాయని కేజ్రీవాల్ తెలిపారు. ఢిల్లీలో కరోనా పరిస్థితి ఘోరంగా ఉందని, రోజుకు 25 వేల మందికి వైరస్ నిర్ధారణ అవుతోందన్నారు. ఆక్సిజన్, రెమ్‌డెసివిర్ కొరత ఉందన్నారు. కోవిడ్ పరీక్షలు, కేసుల విషయంలో పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని.. ప్రస్తుత కష్టకాలంలో ఢిల్లీలోని రెండు కోట్ల మంది ప్రజలు సమిష్టిగా ఉండాలని అన్నారు. ఢిల్లీలో పరిస్థితి ఎలా ఉందో చెబుతున్నామని, భయపెట్టడం మా ఉద్దేశం కాదని కేజ్రీవాల్ అన్నారు.
కోవిడ్-19 పరిస్థితి, లాక్‌డౌన్ అంశంపై చర్చించేందుకు ఢిల్లీ సీఎ కేజ్రీవాల్ సోమవారం ఉదయం లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్‌తో సమావేశం అనంతరం ఈ ప్రకటనను విడుదల చేశారు. రోజువారీ కరోనా కేసులు, మరణాల పెరుగుదల నేపథ్యంలో దేశ రాజధానిలో ఆరు రోజుల పూర్తి లాక్‌డౌన్ విధిస్తున్నట్టు కేజ్రీవాల్ ప్రకటించారు. కష్టమైనా లాక్‌డౌన్ తప్పలేదని అన్నారు. వలస కార‍్మికులు ఇక్కడే ఉండాలని సూచించారు. అవసరమైన సేవలు, ఆహార సేవలు, వైద్య సేవలు కొనసాగుతాయని అన్నారు.