కర్ణాటక మాజీ మంత్రి రమేష్ జార్కిహొళి రాసలీలల సీడీ కేసుకు సంబంధించిన వ్యవహారంలో ఒక్కో రోజు.. ఒక్కో విషయం బయటకు వస్తూ ఉంది. సీడీ కేసులో దొడ్డ తాలూకా లఘుమేనహళ్లికి చెందిన లక్ష్మిపతి (30) అనే యువకున్ని సిట్ పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. లక్ష్మిపతి ఆ సీడీని సామాజిక కార్యకర్త కల్లహళ్లి దినేశ్‌కి ఇచ్చాడనే ఆరోపణపై అరెస్టయ్యాడు. అతని కుటుంబం లఘుమేనహళ్లిలో ఒక చిన్న సిమెంట్ షీట్ల ఇంట్లో నివసిస్తోంది. తమ అబ్బాయి చాలా మంచోడని, అలాంటివాడయితే ఇలాంటి ఇంట్లో నివసించాల్సిన అవసరం లేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
తమ ఇంట్లో కనీసం టీవీ కూడా లేదంటున్నారు. మూడు నెలల క్రితం గ్రామపంచాయతీ ఎన్నికలప్పుడు వచ్చాడని, తరువాత రాలేదని చెబుతున్నారు. దేవనహళ్లిలో హ్యాకింగ్ స్పెషలిస్ట్, మాజీ విలేఖరి శ్రవణ్ అనే యువకున్ని కూడా ఈ కేసులో అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఇక ఈ కేసులో ప్రధాన సూత్రధారులుగా ఉన్న ఇద్దరు వ్యక్తులతో పాటు బాధిత యువతి ఢిల్లీలో ఉండొచ్చనే అనుమానంతో సిట్ అధికారులు దేశ రాజధాని చుట్టుపక్కల గాలింపు చేపట్టారు. రాసలీల సీడీతో తనకు ఏ మాత్రం సంబంధం లేదంటూ ఈ కేసులో కీలకంగా మారిన ప్రధాన సూత్రధారి నరేశ్‌గౌడ గురువారం విడుదల చేసిన వీడియోను ఢిల్లీ నుంచే అప్‌లోడ్ చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు.
వీడియో విడుదల చేసిన అనంతరం నరేశ్‌గౌడతో పాటు మిగిలిన వారు ఢిల్లీలో తాము ఉంటున్న స్థలాన్ని వీడి మరో ప్రాంతానికి వెళ్లినట్లుగా కూడా సిట్‌కు సమాచారం అందడంతో ఆ ముగ్గురి ఆచూకీ కోసం ఢిల్లీని సిట్ అధికారులు వెతుకుతూ ఉన్నారు.