శుభవార్త.. త్వరలో సింగిల్ డోస్ టీకా
Single Dose Vaccine to be soon in India.కరోనా మహమ్మారి వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రస్తుతం కొన్ని
By తోట వంశీ కుమార్ Published on 15 May 2021 12:45 PM ISTకరోనా మహమ్మారి వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రస్తుతం కొన్ని వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అవి అన్ని కూడా రెండు డోసుల వ్యాక్సిన్లే. దీంతో రెండు డోసుల మధ్య విరామం, వ్యాక్సిన్ల కొరత వేదిస్తోంది. ఈ పరిస్థితులను అధిగమించేందుకు త్వరలోనే భారత్‌లో సింగిల్ డోసు టీకాలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే అమెరికాకు చెందిన జాన్సన్ అండ్ జాన్సన్ భారత్‌లో వ్యాక్సిన్ ఉత్తత్పి, పంపిణీ చేసేందుకు భాగస్వామ్య కంపెనీ కోసం ప్రయత్నాలు చేస్తుండగా.. రష్యాకు చెందిన సుత్నిక్ లైట్ వ్యాక్సిన్లు త్వరలోనే అందుబాటులోకి రానుంది.
రష్యాకు చెందిన స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్ చివరి దశ ప్రయోగ ఫలితాలు ఈ నెల చివరి నాటికి వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో జూలై చివరి నాటికి భారత్‌లో స్పుత్నిక్ లైట్ అందుబాటులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. స్పుత్నిక్ వి' వ్యాక్సిన్ ను భారత్ లో పంపిణి చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్న డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్.. 'స్పుత్నిక్ లైట్' సింగిల్ డోస్ వ్యాక్సిన్ కోసం కేంద్రంతో సంప్రదింపులు జరుపుతోంది. ఈ సందర్భంగా వర్చువల్ సమావేశంలో రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (ఆర్‌డీఐఎఫ్) సీఈఓ కిరిల్ డిమిత్రోవ్ మాట్లాడుతూ.. త్వరలోనే భారతదేశంలో స్పుత్నిక్-వీ లైట్‌ను కూడా లాంచ్ చేయాలని భావిస్తున్నామన్నారు.
అదే జరిగితే సింగిల్ డోస్ స్పుత్నిక్-వీ లైట్ దేశంలో విడుదలైన తొలి టీకా అవుతుందన్నారు. స్థానిక సరఫరా ప్రారంభమైనప్పుడు టీకా ధర తగ్గే అవకాశం ఉందన్నారు. ఈ ఏడాది దేశంలో 850 మిలియన్లకు పైగా టీకాలను ఉత్పత్తి చేయాలని రష్యా భావిస్తోందని డిమిత్రోవ్ చెప్పారు. వ్యాక్సిన్ కొరతతో సతమతమవుతున్న భారత్‌లో సింగిల్ డోస్ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే కరోనా పోరులో గేమ్ ఛేంజర్‌గా మారుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.