కేజ్రీవాల్ తొందరపడ్డారా..?

Singapore foreign minister slams Arvind Kejriwal, asks him to 'stick to facts'. దేశంలో కరోనా కొత్త స్ట్రెయిన్ ఉందనే వార్తల్లో నిజం లేదని సింగపూర్ తెలిపింది. B.1.617.2 అనే ఈ వేరియంట్ అనేక కరోనా కేసుల్లో బయటపడిందని..

By Medi Samrat  Published on  19 May 2021 9:59 AM GMT
Arvind Kejriwal

సింగ‌పూర్ లో వ్యాపిస్తున్న క‌రోనా వైర‌స్ నూత‌న స్ట్రెయిన్ ప‌ట్ల ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ ఆందోళ‌న వ్య‌క్తం చేసిన సంగతి తెలిసిందే..! భార‌త్ లో కొవిడ్-19 థ‌ర్డ్ వేవ్ వ్యాప్తిలో సింగ‌పూర్ కొవిడ్ స్ట్రెయిన్ విరుచుకుప‌డ‌వ‌చ్చ‌ని.. సింగ‌పూర్ నుంచి విమాన రాక‌పోక‌ల‌ను త‌క్ష‌ణ‌మే నిలిపివేయాల‌ని, చిన్నారుల‌కు కొవిడ్ వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను వేగవంతం చేయాల‌ని ఆయ‌న కేంద్ర ప్ర‌భుత్వానికి సూచించారు. సింగ‌పూర్ స్ట్రెయిన్ థ‌ర్డ్ వేవ్ రూపంలో భార‌త్ ను తాక‌వ‌చ్చ‌ని కేజ్రీవాల్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. చిన్నారుల‌ను కాపాడుకునేందుకు మ‌నం వారికి వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను ముమ్మ‌రం చేయాల‌ని ట్వీట్ చేశారు.

తమ దేశంలో కరోనా కొత్త స్ట్రెయిన్ ఉందనే వార్తల్లో నిజం లేదని సింగపూర్ తెలిపింది. B.1.617.2 అనే ఈ వేరియంట్ అనేక కరోనా కేసుల్లో బయటపడిందని.. తాజాగా సింగపూర్ లో కూడా వెలుగు చూసిందని సింగపూర్ ప్రభుత్వం తెలిపింది. ఈ వేరియంట్ ను మొదట భారత్ లోనే గుర్తించారని.. ఇప్పుడు అనేక దేశాల్లో ఈ వేరియంట్ బయటపడుతోందని సింగపూర్ వైద్య శాఖ అధికారులు వెల్లడించారు. కేజ్రీవాల్ వ్యాఖ్యలను మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ తప్పుబట్టింది. 'సింగపూర్ వేరియంట్' అంటూ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు సమర్థనీయం కావని అన్నారు.

భారత విదేశాంగ మంత్రి జైశంకర్ మాట్లాడుతూ ఒక రాజకీయ నాయకుడు వాస్తవాలను తెలుసుకోకుండా చేసిన వ్యాఖ్యలు నిరుత్సాహాన్ని కలిగిస్తున్నాయని అన్నారు. దేశం గురించి మాట్లాడాల్సిన అవసరం ఢిల్లీ ముఖ్యమంత్రికి లేదని వ్యాఖ్యానించారు. సింగపూర్ తో భారత్ కు బలమైన సంబంధాలు ఉన్నాయని కరోనాపై పోరాటంలో కూడా ఇరు దేశాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని చెప్పారు. ఢిల్లీ ముఖ్యమంత్రి బాధ్యతారాహిత్యంగా చేసిన వ్యాఖ్యలు సింగపూర్ తో సుదీర్ఘకాలంగా ఉన్న బంధాలను బలహీనపరిచేలా ఉన్నాయని అన్నారు. భారత్-సింగపూర్ కలిసి కరోనాపై పోరాటం చేస్తూ ఉన్నాయని.. ఎన్నో ఏళ్లుగా ఇరు దేశాల మధ్య మంచి అనుబంధం ఉందని అన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు భారత్ చేసిన వ్యాఖ్యలుగా భావించకూడదని జై శంకర్ అన్నారు.


Next Story
Share it