షూటర్ దాదీ ఇక లేరు
Shooter Dadi passes away due to COVID-19. షూటర్ దాదీగా పిలవబడే వెటరన్ షూటర్ చంద్రో తోమర్ ఇక లేరు.
By Medi Samrat
షూటర్ దాదీగా పిలవబడే వెటరన్ షూటర్ చంద్రో తోమర్ ఇక లేరు. కరోనా మహమ్మారి కారణంగా ఆమె ప్రాణాలను వదిలారు. ఆమె వయసు 89 సంవత్సరాలు. ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో ఆమెకు చికిత్స అందించారు. షూటర్ దీదీ లింగ వివక్షపై పోరాటం చేసిన గొప్ప మహిళగా పలువురు చెప్పుకొచ్చారు. ఆమె మృతిపై యూనియన్ మినిస్టర్ హర్దీప్ సింగ్ పూరీ ట్వీట్ చేశారు. ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని, సమాజంతో పోరాడి షూటింగ్ ను ఆమె ఎంచుకున్నారు. ఆ రంగంలో అద్భుతమైన విజయాలను అందుకున్నారు.
చంద్రో తోమర్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బాఘ్ పట్ కు చెందిన వారు. 65 సంవత్సరాల వయసులో ఆమె షూటింగ్ లో ఆరంగేట్రం చేశారంటే ఆశ్చర్యపోక తప్పదు. ఆమె 30కి పైగా నేషనల్ ఛాంపియన్ షిప్ లు గెలిచారు. ఆమె మేన కోడలు ప్రకాషి తోమర్ కూడా షూటర్ గా పలు విజయాలను అందుకున్నారు. తాప్సి, భూమి పెడ్నేకర్ నటించిన 'సాండ్ కీ ఆంఖ్' సినిమా వీరి మీదనే తీశారు. 2019 లో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా.. ప్రశంసలు కూడా దక్కించుకుంది. ఆమె కొద్దిరోజుల కిందట అస్వస్థతకు గురవ్వడంతో పలువురు సెలెబ్రిటీలు, రాజకీయనాయకులు ఆమె కోలుకోవాలని ఆకాంక్షించారు. వైద్యులు ఆమెను కాపాడాలని ప్రయత్నించినప్పటికీ వీలుపడలేదు. ఆమె మృతిపై పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.