కొందరు ప్రభుత్వ ఉద్యోగులు తమ విధి నిర్వహణలో ఎంత నిర్లక్ష్యంగా ఉంటారో చెప్పే ఘటన ఇది. ఓ ప్రభుత్వ వైద్యుడి నిర్లక్ష్యం ఏడు నెలల గర్భిణి ప్రాణానికే ముప్పు తెచ్చిపెట్టింది. కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళితే.. నెలలు నిండకముందే ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీశాడు. అయితే..పిండం పూర్తిగా అభివృద్ది చెందకపోవడాన్ని గ్రహించి తిరిగి బిడ్డను కడుపులో పెట్టి కుట్లు వేశాడు. ఈ ఘటన అసోం రాష్ట్రంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. నవీ నమశూద్ర అనే మహిళ గర్భం దాల్చింది. తనకు పుట్టబోయే బిడ్డ గురించి ఎన్నో కలలు కంటోంది. 7 నెలలు నిండాయి. మరో రెండు నెలల్లో తన చిన్నారి రూపాన్ని చూస్తానని ఎంతో ఆశతో ఎదురుచూస్తుంది. ఓ రోజు కడుపులో నొప్పిగా అనిపించడంతో కరీంగంజ్‌లోని ఓ ప్రభుత్వాసుపత్రికి వెళ్లింది. గైనకాలజిస్ట్ ఆశిష్ కుమార్ బిస్వాస్ ఆమెను పరీక్షించకుండానే ఆపరేషన్ థియేటర్‌కు తీసుకువెళ్లాడు.
శస్త్ర చికిత్స చేసి కడుపులోకి బిడ్డను బయటకు తీశాడు. అయితే.. పిండం ఇంకా పూర్తిగా వృద్ధి చెందలేదు. వెంటనే అతడు పిండాన్ని మళ్లీ లోపల పెట్టి కుట్లు వేసి పంపించి వేశాడు. అయితే.. ఈ విషయం ఆమెకు, ఆమె కుటుంబ సభ్యులు ఎవ్వరికి తెలియదు. ఈ ఘటన జరిగిన 12 రోజుల తరువాత బుధవారం నవీ నమశూద్ర ఆరోగ్యం విషమించడంతో ఆస్పత్రికి తీసుకువెళ్లగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
బాధితురాలి కుటుంబ సభ్యులు, స్థానికులు పెద్ద ఎత్తున ఆస్పత్రికి చేరుకున్నారు. ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్‌ను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. దీంతో ఆస్పత్రి ఎదుట ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని బాధితులతో మాట్లాడడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.