కుదిరిన సీట్ల సర్దుబాటు.. తొలి జాబితా ప్రకటించిన ఉద్ధవ్‌ శివసేన

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తేదీ సమీపిస్తున్న నేప‌థ్యంలో ప‌లు పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి

By Medi Samrat  Published on  23 Oct 2024 9:15 PM IST
కుదిరిన సీట్ల సర్దుబాటు.. తొలి జాబితా ప్రకటించిన ఉద్ధవ్‌ శివసేన

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తేదీ సమీపిస్తున్న నేప‌థ్యంలో ప‌లు పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. ఈ క్ర‌మంలో రాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే పార్టీ శివసేన (యూబీటీ) అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. ఈ జాబితాలో 65 మంది అభ్యర్థుల పేర్లు ఉన్నాయి. ఉద్ధవ్ కుమారుడు ఆదిత్య ఠాక్రే పేరు కూడా జాబితాలో ఉంది. ఆదిత్య వర్లీ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వర్గానికి చెందిన శివసేన, అజిత్ పవార్ వర్గానికి చెందిన ఎన్‌సిపి జాబితా ఇప్పటికే విడుదలైంది. బీజేపీ 99 మంది అభ్యర్థుల పేర్లను కూడా ప్రకటించింది.

ఇదిలా ఉండగా మహావికాస్ అఘాడిలో సీట్లను విభజించారు. ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం), ఉద్ధవ్ వర్గానికి చెందిన శివసేన, కూటమిలో చేరిన కాంగ్రెస్ సమాన స్థానాల్లో ఎన్నికల్లో పోటీ చేసేందుకు అంగీకరించాయి. ఉద్ధవ్ వర్గం నాయకుడు సంజయ్ రౌత్ విలేకరుల సమావేశంలో సీట్ల పంపిణీని ప్రకటించారు. కాంగ్రెస్, ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం), ఉద్ధవ్ వర్గానికి చెందిన శివసేన.. మూడు పార్టీలు త‌లా 85 స్థానాల చొప్పున ఎన్నికల్లో పోటీ చేస్తాయని ఆయన చెప్పారు. ప్రస్తుతం 270 నియోజకవర్గాలపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలిపారు. మిగతా 18 సీట్లపై సమాజ్‌వాదీ పార్టీతో చర్చించాక నిర్ణయం తీసుకుంటామని వెల్ల‌డించారు. ఎన్నికల్లో మహావికాస్ అఘాడిగా పోటీ చేస్తున్నామని.. మేమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని రౌత్ ప్రకటించారు.

Next Story