సాయిబాబా భక్తులకు శుభవార్త చెప్పిన షిర్డీ ఆలయం
Shirdi Temple Allows 10,000 More Devotees Per Day.సాయిబాబా భక్తులకు శుభవార్త. ఎప్పుడెప్పుడు షిరిడీ వెళ్లి
By తోట వంశీ కుమార్ Published on 17 Nov 2021 3:05 PM IST
సాయిబాబా భక్తులకు శుభవార్త. ఎప్పుడెప్పుడు షిరిడీ వెళ్లి సాయిబాబాను దర్శించుకుందామా అని ఎదురు చూస్తున్న భక్తులకు దేవస్థానం ట్రస్ట్ తీపి కబురు చెప్పింది. కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటి వరకు రోజుకు కేవలం 15 వేల మంది భక్తులను మాత్రమే బాబా దర్శనానికి అనుమతి ఇస్తుండగా.. అదనంగా మరో 10 వేల మందికి బాబాను దర్శించుకునే అవకాశం కల్పించనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు షిర్డీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ తెలిపింది.
కరోనా తొలి వేవ్ సమయంలో గత ఏడాది మార్చి 17న షిర్డి ఆలయంలో దర్శనాలు నిలిపివేయగా నవంబర్ 16న మళ్లీ పునఃప్రారంభించారు. అయితే అనంతరం రెండో వేవ్ ఉద్దృతి కొనసాగడంతో మరోసారి ఈ ఏడాది ఏప్రిల్ 5వ తేదీన ఆలయంలో దర్శనాలను నిలిపివేశారు. మళ్లీ అక్టోబర్ 7 నుంచి దర్శనాలను పునఃప్రారంభించారు. కరోనా నిబంధనలను పాటిస్తూ రోజుకు 15వేల మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు. ప్రస్తుతం కేసులు తగ్గుముఖం పట్టడంతో రోజుకు 25వేల మంది భక్తులను ఆలయంలో దర్శనానికి అనుమతి ఇస్తూ అహ్మదర్‌నగర్ కలెక్టర్ రాజేంద్ర భోంస్లే ఉత్తర్వులు జారీ చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన కొవిడ్-19 మార్గదర్శకాలను పాటించేలా అన్ని చర్యలు తీసుకుంటామని ఆలయ ట్రస్ట్ హామీ ఇచ్చిందని కలెక్టర్ తెలిపారు. ఇక కరోనా మహమ్మారి ముందు బాబా దర్శనానికి ప్రతి రోజు లక్షల సంఖ్యలో భక్తులు షిర్డీకి వచ్చేశారు.