ముఖ్యమంత్రిగా ప‌నిచేసిన‌ వ్యక్తికి డిప్యూటీ సీఎం సరిపోదు..!

మహారాష్ట్రలో రాజకీయ ఉత్కంఠ పెరుగుతోంది. మహాయుతిలో సీఎంపై చర్చ తర్వాత ఇప్పుడు మంత్రిత్వ శాఖల విషయంలో తర్జనభర్జనలు జరుగుతున్నాయి.

By Medi Samrat  Published on  29 Nov 2024 4:52 PM IST
ముఖ్యమంత్రిగా ప‌నిచేసిన‌ వ్యక్తికి డిప్యూటీ సీఎం సరిపోదు..!

మహారాష్ట్రలో రాజకీయ ఉత్కంఠ పెరుగుతోంది. మహాయుతిలో సీఎంపై చర్చ తర్వాత ఇప్పుడు మంత్రిత్వ శాఖల విషయంలో తర్జనభర్జనలు జరుగుతున్నాయి. మహాయుతికి చెందిన ముగ్గురు పెద్ద నేతలు దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ నిన్న అమిత్ షాను కలిశారు. కానీ ఇప్పటికీ పరిష్కారం దొరకలేదు. కాగా, శివసేన ఎమ్మెల్యే, అధికార ప్రతినిధి సంజయ్ శిర్సత్ షిండే భవిష్యత్ వ్యూహం గురించి చెప్పారు.

ఏక్‌నాథ్ షిండే డిప్యూటీ సీఎం కారని శిర్సత్ అన్నారు. ఆయన స్థానంలో వేరొక‌రు డిప్యూటీ సీఎం కావచ్చని అన్నారు. కేంద్ర ప్రభుత్వంలో ఏక్‌నాథ్ షిండే మంత్రి అయ్యే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే.. షిండే కేంద్రంలో ఉండ‌ర‌ని, మహారాష్ట్ర ప్రజలకు మాత్రమే సేవ చేస్తార‌ని శిర్సత్ స్పష్టం చేశారు. ముఖ్యమైన మంత్రిత్వ శాఖను నిర్వహిస్తార‌ని చెప్పారు.

ఏక్‌నాథ్ షిండే ఉప ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదని శిర్సత్ అన్నారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి ఇది సరిపోదు. ఉప ముఖ్యమంత్రి పదవికి షిండే నేతృత్వంలోని శివసేన.. మరో నేతను ప్రతిపాదించనుందని ఆయన అన్నారు.

నిన్న ఏకనాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్‌లు అమిత్ షాతో సమావేశమై మహారాష్ట్ర సీఎం పదవిపై నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ సమావేశంలో కూడా ఎలాంటి పరిష్కారం లభించలేదు. సమావేశం అనంతరం షిండే మాట్లాడుతూ.. అంతా సానుకూలంగానే ఉందని, ప్రధాని మోదీ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని తాను అంగీకరిస్తానని చెప్పారు.

అమిత్ షాతో మహాకూటమి నేతల భేటీపై బీజేపీ నేత సుధీర్ ముంగంటివార్ మాట్లాడుతూ.. కొత్త ప్రభుత్వం ప్రమాణస్వీకారోత్సవానికి చర్చలు జరిగాయని.. అందులో పరిష్కారం కనుగొనే దిశగా చర్చలు జరుగుతాయని చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటు, సీఎం ప‌ద‌విపై చ‌ర్చ జ‌రిగింద‌ని అన్నారు. ముఖ్యమంత్రి మహారాష్ట్రను ముందుకు తీసుకెళ్లి ఛత్రపతి శివాజీ మహారాజ్ సంకల్పాన్ని నెరవేరుస్తారన్నారు.

Next Story